భద్రాచలం, వెలుగు: ఏప్రిల్9 నుంచి 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనం అనంతరం సీఎం హెలీకాప్టర్‌లో భద్రాచలం చేరుకుని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆయనకు ఈవో ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన ఆయన గర్భగుడి, లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. తర్వాత శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. ఈయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.