గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. విజయం సాధించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యకర్తలకు సూచించారు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు, ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు, రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నీలజీ యూనివర్సిటీ లాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని ఆయన వివరించారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
Also Read :- సినీ నటుడు సాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ
పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న మొదటి ఎన్నికల కాబట్టి అత్యంత పకడ్బందీగా మంచి వ్యూహంతో ముందుకు పోవాలని ముఖ్యమంత్రి నేతలకు సూచించారు. ఎంతోమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓట్ల కోసం ఉంటారని వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించి వచ్చే ఎన్నికల్లో తమ వైపు ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రధానంగా యూత్ కాంగ్రెస్ ఎన్‌ఎస్‌యుఐ సంఘాలు ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా వ్యూహరచన చేయాలని ఆయన సూచించారు.