మైనారిటీలు మా కుటుంబ సభ్యులు: సీఎం

మైనారిటీలు మా కుటుంబ సభ్యులు: సీఎం
  • దేశంలో మోదీ పరివార్.. గాంధీ పరివార్​
  • ఎటువైపు ఉండాలో జనం నిర్ణయించుకోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
  • మైనారిటీలు మా కుటుంబ సభ్యులు
  • వాళ్లను ఏనాడూ ఓటు బ్యాంకుగా చూడలే 
  • మోదీని ఓడించి రాహుల్​ను ప్రధానిగా చేయాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారని చెప్పారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ వేడుకల్లో సీఎం మాట్లాడారు. “దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు. ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తున్నది. దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తున్నది” అని అన్నారు. 

కాంగ్రెస్​ పార్టీ ఏనాడూ ముస్లింలను ఓటర్లుగా చూడలేదని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావించామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయామని, అందుకే కేబినెట్​లో మైనారిటీ మంత్రికి అవకాశం దక్కలేదన్నారు. కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా చేశామని, అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్పారు. కార్పొరేషన్లలో ముస్లింలకు అవకాశం ఇచ్చినట్టు సీఎం చెప్పారు. వైఎస్ తర్వాత ఇప్పటి వరకు సీఎంఓలో మైనారిటీ అధికారిని నియమించలేదని, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించినట్టు వెల్లడించారు. 

దేశంలో మైనారిటీలకు సీఎంలుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలంతా మోదీ పరివార్​తో ఉండాలో, గాంధీ పరివార్ తో ఉండాలో నిర్ణయించుకోవాలన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలన్నారు. దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించొద్దని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం టీజీఎమ్​ఆర్​ఈఐఎస్​ వెబ్ సైట్, ఆన్ లైన్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, టీజీఎమ్​ఆర్​ఈఐఎస్​ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ అహ్మద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, ఇతర నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారు.