కాంగ్రెస్​లో కొత్త, పాత కొట్లాట

  • జిల్లాల్లో టీపీసీసీ చీఫ్​ వర్సెస్​ సీనియర్ల గ్రూపులు
  • వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం పోటీపడుతున్న నేతలు
  • కొత్తగా చేరుతున్న లీడర్లంతా రేవంత్​ గ్రూపులోనే..
  • టికెట్​ ఆశతో సరెండర్​ అవుతున్న మరికొందరు

మంచిర్యాల/ నెట్​వర్క్, వెలుగు: కర్నాటక ఎన్నికల తర్వాత జోష్​లోకి వచ్చిన కాంగ్రెస్​లోకి కొత్త లీడర్ల చేరికలు, వాటితోపాటే గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలో కొత్త, పాత నేతల మధ్య వార్​ రోజురోజుకూ ముదురుతోంది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీనియర్​ లీడర్ల నడుమ ఉప్పు, నిప్పు లాంటి పరిస్థితి ఉండడంతో జిల్లాల్లోనూ వారి ఫాలోవర్స్​ గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. 

కొత్తగా పార్టీలోకి వస్తున్న నేతలు రేవంత్​ వర్గంగా ముద్ర వేసుకోవడం, టికెట్​ రేసులో ఉన్న కొంతమంది పాత లీడర్లు ఆయనకు సరెండర్​ కావడం  సీనియర్లకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. రేవంత్​ గతంలో తనతో టీడీపీలో పనిచేసిన వారిని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటూ నియోజకవర్గాల్లో చిచ్చు పెడ్తున్నారని సీనియర్లు విమర్శిస్తుండగా, పలువురు సీనియర్లే బీఆర్ఎస్ పెద్దలతో టచ్​లోకి వెళ్తూ క్యాడర్​ను అయోమయంలో పడేస్తున్నారని రేవంత్​ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

ఆదిలాబాద్​లో పీఎస్సార్​కు చెక్..

ఉమ్మడి ఆదిలాబాద్ ​జిల్లాలో నిన్నమొన్నటిదాకా హల్​చల్​ చేసిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్​ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావుకు రేవంత్​రెడ్డి చెక్ పెడ్తున్నారు. ఇన్నాళ్లూ యాక్టివ్​ పాలిటిక్స్​కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి రామచంద్రారెడ్డిని రేవంత్​ తెరపైకి తీసుకొచ్చి పార్టీ బాధ్యతలను అప్పగించడంతో పీఎస్సార్​ నారాజ్​అయ్యారు.  రేవంత్​తో పొసగకపోవడం వల్లే నిర్మల్​ డీసీసీ చైర్మన్​ ఏలేటి మహేశ్వర్​రెడ్డి బీజేపీలో చేరారు. 

అక్కడి బీఆర్​ఎస్​ అసంతృప్త నేత శ్రీహరిరావును కాంగ్రెస్​లో చేర్చుకోవడంతో గ్రూపు తగాదాలు కొద్దిగా సద్దుమణిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో డీసీసీ చైర్మన్​ విశ్వప్రసాద్​రావును తన అన్న ప్రేమ్​సాగర్ రావుపైకి గురిపెట్టారు. భట్టి పాదయాత్ర సభలోనే అన్నదమ్ములు బాహాబాహీకి దిగి నవ్వుల పాలయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్​ను పీఎస్సార్​కు వ్యతిరేకంగా ఎంకరేజ్​ చేస్తున్నారు. వినోద్​ నాన్​ లోకల్ అంటూ లోకల్​ సెంటిమెంట్​ను రెచ్చగొట్టిన ఎనిమిది మంది లీడర్లకు ఇటీవల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. 

ఆ తర్వాత ప్రేమ్​సాగర్​రావు తన అనుచరులతో సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లి బెల్లంపల్లి టికెట్​ లోకల్​ లీడర్లకే ఇవ్వాలని కోరారు.  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అనుచరుడైన సింగరేణి డాక్టర్​ రాజారమేశ్​ను కాంగ్రెస్​లో చేర్చుకోవడంతో చెన్నూర్​ నియోజకవర్గంలో పార్టీకి ఊపు వచ్చింది. కానీ రాజారమేశ్​కు వ్యతిరేకంగా పీఎస్సార్​ తన అనుచరులను ఉసిగొల్పుతున్నారు.

దామోదర్​రెడ్డి వర్సెస్​ పటేల్​ రమేశ్​రెడ్డి.. 

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ సపోర్ట్​తో కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన చల్లమల కృష్ణారెడ్డికి, మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి నడుమ వర్గపోరు పీక్స్​కు చేరింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. కానీ జిల్లా కాంగ్రెస్ పెద్దలు స్రవంతి పేరును ఫైనల్​ చేయించారు. 

ఉప ఎన్నికలు అయ్యాక నియోజకవర్గంలో మండల కమిటీ నియామకాలు పార్టీలో చిచ్చుపెట్టాయి. రేవంత్​ సపోర్ట్​తో కృష్ణారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయన తీరును వ్యతిరేకిస్తూ ఇటీవల గాంధీభవన్ వద్ద స్రవంతి వర్గం నిరసన చేపట్టింది. ఇక సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రమేశ్​రెడ్డి మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 

రేవంత్ రెడ్డి తోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పటేల్ రమేశ్​రెడ్డి 2018 లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ సారి ఎలాగైనా టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల భట్టి పాదయాత్ర సందర్భంగా ఇద్దరు బల ప్రదర్శనకు దిగారు. 

ఖమ్మంలో పొంగులేటి కాక.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో సీనియర్లకు రేవంత్ రెడ్డి చెక్​ పెడ్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఉంది. వాళ్ల అనుచరుల మధ్యే టికెట్ల లొల్లి ఉంటుందనుకుంటున్న టైంలో పొంగులేటి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఉమ్మడి జిల్లాలో మెజారిటీ సీట్లు తన అనుచరులకు కేటాయించాలని చేరిక సమయంలో పొంగులేటి డిమాండ్ చేసినట్టు, కొన్ని సీట్లకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అవి ఏ సీట్లు అనేది ఇప్పటికి సస్పెన్స్​గా ఉన్నప్పటికీ  ఎన్నికలు దగ్గరపడ్డ కొద్దీ టికెట్ల పంచాయితీ రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

వనపర్తిలో చిన్నారెడ్డికి చిచ్చు..

వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డిని రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయిన మేఘారెడ్డికి వనపర్తి టికెట్​పై రేవంత్​ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20న కొల్లాపూర్ లో ప్రియాంకగాంధీ ముఖ్య​అతిథిగా నిర్వహించనున్న కాంగ్రెస్​ బహిరంగ సభ వేదికగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు మేఘారెడ్డి చేరనున్నారు. 

ఇది చిన్నారెడ్డికి చిచ్చుపెట్టడంలాంటిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్​లో రేవంత్ ​వర్గానికి చెందిన సీఆర్​ జగదీశ్వర్​రావు టికెట్​పై ఆశలు పెట్టుకొని కొంతకాలంగా క్యాడర్​ను సమీకరిస్తున్నారు. ఇలాంటి టైంలో జూపల్లి సీనియర్ల ప్రతినిధిగా జాయిన్​ కాబోతుండడం జగదీశ్వర్​రావుకు మింగుడు పడడం లేదు. ఒకవేళ తనను కాదని జూపల్లికి టికెట్​ ఇస్తే రూ.50 కోట్లు ఖర్చు పెట్టయినా సరే, ఆయనను ఓడిస్తానని సన్నిహితుల వద్ద శపథం చేస్తున్నట్లు తెలిసింది. 

గద్వాల టికెట్​పై హామీతో జడ్పీ చైర్మన్ సరిత కాంగ్రెస్​లో చేరేందుకు రెడీ అవుతుండగా, పటేల్​ ప్రభాకర్​రెడ్డి వర్గీయులు మండిపడ్తున్నారు.  డీసీసీ ప్రెసిడెంట్ గా ఇన్నాళ్లూ పార్టీని ముందుకు నడిపిన ప్రభాకర్​రెడ్డిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లకు టికెట్ ​ఇస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. కాగా, ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్మిషన్​ లేకుండా జరుగుతున్న చేరికలు ఎటుదారిస్తాయోననే చర్చ జరుగుతోంది.

జనగామలో పొన్నాలకు పొగ..

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో వరంగల్ వెస్ట్ టికెట్ ను హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి తోపాటు టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. జంగా,  నాయిని మొదటి నుంచీ కాంగ్రెస్ లోనే ఉన్నా.. నరేందర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో టికెట్​ రేసులో ముందున్నారు. 

అదే సమయంలో నాయిని, జంగా నడుమ విభేదాలు తార స్థాయికి చేరాయి. జంగాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించగా, తనను సస్పెండ్ చేసే అధికారం నాయినికి లేదని జంగా కామెంట్స్ చేశారు. ఈ పంచాయతీ ఇంకా తెగలేదు. ఇక జనగామలో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మధ్య టికెట్ వార్ తీవ్రస్థాయిలో ఉంది. 

పొన్నాల సీనియారిటీని నమ్ముకోగా, కొమ్మూరి ప్రతాపరెడ్డి రేవంత్ పై ఆశలు పెట్టుకొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సెగ్మెంట్​లో ఇటీవల ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి రంగంలోకి దిగారు. ఈమెను రేవంత్ రెడ్డి తీసుకువచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.