దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ.. పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని చెప్పారు. తమ పార్టీ నేతలను బలిగొన్నా.. దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్‌ను నిలబెట్టారని చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా ఆనాడు బీజేపీ అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు. బ్రిటిష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని రేవంత్ అన్నారు. చైనా, పాక్ లు దేశ సరిహద్దుల్లో కుట్రలకు పాల్పడుతున్నాప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు సీఎం కేసీఆర్ పైనా ఆయన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జనవరి 26 నుంచి ప్రజల కోసం హాత్ సే హాత్ జోడో యాత్రకు కదలిరండి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.