పదేండ్లు రేవంతే సీఎం .. మా పార్టీలో గ్రూపుల్లేవు: మంత్రి కోమటిరెడ్డి

  • అందరం కలిసికట్టుగా పని చేస్తున్నం
  • బీజేపీ, బీఆర్​ఎస్​ లీడర్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు
  • రిక్వెస్ట్ అనుకుంటారో.. వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం
  • ఏక్​నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని ఫైర్​

నల్గొండ, వెలుగు: వచ్చే పదేండ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క సీటు గెలిచినా దేనికంటే దానికి తాను సిద్ధమని చాలెంజ్ విసిరారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి గురువారం నల్గొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన నుంచి ఎమ్మెల్యేలను గుంజుకుని ఏక్​నాథ్ షిండే అనే పదాన్ని బీజేపీనే సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. దీన్ని రిక్వెస్ట్​గా తీసుకుంటారో.. లేక వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. పార్లమెంట్ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఒకడు.. పార్టీలో పది గ్రూపులు ఉన్నయని ఇంకొకడు.. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరిగాక ఆ ప్రభుత్వం ఐదేండ్ల పాటు అధికారంలో ఉంటది’’అని స్పష్టం చేశారు.

సీనియర్ల సలహాలతో ముందుకెళ్తున్నం

సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్, ఎమ్మెల్యేలంతా కలిసి ఓ టీమ్​గా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ‘‘బీఆర్ఎస్​కు ఎంపీ అభ్యర్థులే దొరకడం లేదు. అందుకే లీడర్లు, కార్యకర్తలు బయటికొచ్చేస్తున్నారు. ఆ పార్టీ పడుతున్న బాధలు అన్నీ.. ఇన్నీ కావు’’అని ఎద్దేవా చేశారు. ‘‘జాతీయ పార్టీ అన్నాక ఎన్నో అంతర్గత విషయాలు ఉంటయ్. వాటి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ పార్టీలో బండి సంజయ్​ను పక్కనపెట్టి కిషన్ రెడ్డికి స్టేట్ పగ్గాలు ఎందుకు ఇచ్చారో నీకు తెలుసా’’అని మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. ‘‘పార్టీలో ఐదు గ్రూపులున్నాయని అంటున్నరు. భట్టి విక్రమార్క గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. భట్టి అంటే మాకెంతో గౌరవం’’అని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. దళితులను వాడుకుని సీఎం అయ్యింది నువ్వు అంటూ కేసీఆర్​పై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘పదేండ్ల పాలనతో రాష్ట్రాన్ని వందేండ్లు వెనక్కి తీసుకుపోయినవ్. మహబూబ్​నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మా అభ్యర్థులు 60 నుంచి 70వేల మెజారిటీతో గెలిచిన్రు. అయినా.. నీకు ఇంకా సీన్ ఏంటో అర్థం కావడం లేదా?’’అని ప్రశ్నించారు.

నేనొక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను

తన గురించి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ‘‘నేనొక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాను. 50 ఏండ్లు అధికారంలో ఉన్నం. కానీ.. మేము ప్రభుత్వాలు కూల్చలేదు. సెక్యులర్ పార్టీగా.. అపోజిషన్ లీడర్లకు ఇదే నా లాస్ట్ వార్నింగ్.. ఇంకోసారి ప్రభుత్వం కూలిపోతుందనే మాటలు మాట్లాడొద్దు. తీరు మార్చుకోకపోతే బుద్ధి చెప్తాం’అని వెంకట్ రెడ్డి అన్నారు.