తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో తీవ్ర కృషి చేసిన రేవంత్, హస్తం పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి చేసిన శ్రమకు ఫలితం దక్కింది. సీఎల్పీ నేతగా ఏఐసీసీ రేవంత్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీపీఐ, తెలంగాణ జనసమితితో పొత్తులు పెట్టుకోవడం, సీపీఎంతో పొత్తు లేకపోయినా మద్దతు పొందడంతో పాటు, రాష్ట్రంలోని మేధావి వర్గం మద్దతును కూడా పొందడంలోనూ సక్సెస్ అయ్యారు.
రాష్ట్రంలోని నియంతృత్వ పోకడల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో, తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడంలో రేవంత్ విశేష కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీకి దూరం అయి ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వివేక్ వెంకటస్వామిలాంటి నేతలతో పాటు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారెందరో కాంగ్రెస్ లోకి తిరిగి రావడం వల్ల పార్టీకి ప్రయోజనం దక్కింది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచే పార్టీ బలపడిందని, నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీల వరుస మీటింగ్‌లు, ప్రజల్లోకి నేరుగా రాహుల్, ప్రియాంక వెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తీరు పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యింది. సీనియర్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా రాష్ట్రంలో విజయవంతం అయ్యింది.
రేవంత్ రాకతో కాంగ్రెస్‌లో జోష్..
2018లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించిన నాటి నుంచి పార్టీ కోసం నిర్విరామంగా పార్టీ కోసం పనిచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన రేవంత్, అంతకు ముందు జడ్పీటీసీగా ఎన్నిక అయ్యారు. రెండు సార్లు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఒక డైనమిక్ నేతగా పేరున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయవంతం అయ్యారు. ఆయన బస్సు యాత్రలు సక్సెస్ అయ్యాయి. రేవంత్ అంటే ప్రత్యేక క్రేజ్ ప్రజల్లో ఏర్పడింది. ప్రస్తుతం మంచి రాజకీయ ఫైటర్‌గా ప్రజల్లో పేరున్న రేవంత్ సీఎం పదవిని అధిష్టించనున్నారు. తమ ప్రజాస్వామ్యప్రభుత్వంలో సీఎం ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రజా దర్బార్లు కూడా ఉంటాయని ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించడంవిశేషం. ఈ నెల 7న ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డి వెంట ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేస్తారో వేచి చూడాలి.
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఉంటుందని ఆశిద్దాం. తెలంగాణ ఉద్యమంలో, అనంతరం రాష్ట్రంలో కేసీఆర్నాయకత్వంలో ప్రభుత్వ పాలనను రెండు సార్లు నెత్తిన ఎక్కించుకున్న జనం.. కేసీఆర్ నియంతృత్వ పోకడపై ఆగ్రహంతో ఈసారి నేలకేసి కొట్టి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా రానున్న కాంగ్రెస్ పాలన ఉంటుందని ఆశిద్దాం. సీనియర్, జూనియర్ అని కాకుండా, అలాంటి లొల్లి పెట్టుకోకుండా, నవ్వేవాడి ముందు జారిపడేలా చేసుకోవద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్