ఇవాళే రేవంత్ చేతికి పీసీసీ పగ్గాలు

ఇవాళే రేవంత్ చేతికి పీసీసీ పగ్గాలు

హైదరాబాద్​, వెలుగు: పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. అంతకన్నా ముందు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్​లోని పెద్దమ్మ టెంపుల్​కు వెళ్లి పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి నాంపల్లిలోని యూసుఫ్​బాబా దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తర్వాత గాంధీ భవన్​కు వెళ్లి బాధ్యతలు తీసుకుంటారు. కార్యక్రమానికి కాంగ్రెస్​ ముఖ్య నేతలతో పాటు వేరే రాష్ట్రాల నేతలూ హాజరవుతారని గాంధీ భవన్​ వర్గాలు వెల్లడించాయి. తర్వాత అక్కడే బహరింగ సభ నిర్వహిస్తారు. పీసీసీకి కొత్త చీఫ్​తో పాటే గాంధీ భవన్​ కూడా కొత్తగా ముస్తాబైంది. బిల్డింగ్​కు సున్నాలు, రంగులు వేసి తీర్చిదిద్దారు. గాంధీభవన్​లో వాస్తు మార్పులు చేశారు. పీసీసీ మునుపటి చీఫ్​ చాంబర్​కు పక్కనే ఉన్న మీటింగ్​ హాల్​, ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చాంబర్​ను కలిపి పీసీసీ ప్రెసిడెంట్​చాంబర్​ చేశారు. పీసీసీ మాజీ చీఫ్​ ఉత్తమ్​ వాస్తుకు తగ్గట్టు మూసేసిన గేటును ఇప్పుడు తెరిచి రెండు గేట్లను అందుబాటులోకి తేనున్నారు. 

పార్టీ కోసం జోడెద్దుల్లా పనిచేస్తం: రేవంత్​ 

పీసీసీ పదవి దక్కిన వెంటనే రేవంత్​ పార్టీ సీనియర్​ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అసంతృప్తులనూ కలిసి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంగళవారం పీసీసీ మాజీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి దంపతులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీకి కొత్తగా ఎన్నికైన వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి, మర్రిశశిధర్​ రెడ్డిలను వారి వారి ఇండ్లలో రేవంత్​ మర్యాదపూర్వకంగా కలిశారు. భట్టి ఇంట్లో రేవంత్​ను భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య సత్కరించారు.  పార్టీకి సీఎల్పీ, పీసీసీ రెండు కళ్లలాంటివని, తామిద్దరం పార్టీ కోసం జోడెద్దుల్లా పనిచేస్తామని రేవంత్​అన్నారు. తెలంగాణ ఆకాంక్షల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. రేవంత్​ పదవీ స్వీకార కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని భట్టి పిలుపునిచ్చారు. కార్యకర్తలను కలుపుకునిపోయి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ​ రేవంత్​కు సూచించారు. కాగా, అంతకుముందు బెంగళూరు నుంచి ఉదయం హైదరాబాద్​కు వచ్చిన రేవంత్​.. నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశమయ్యారు.