హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉద్యోగులు, టీచర్లు సొంత జిల్లాలోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. ఏ అన్యాయాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రం కోసం ఉద్యమించారో అవే పరిస్థితులు తెలంగాణలో పునరావృతం కావడం దారుణమని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు అర్థం లేకుండా చేస్తున్న ఈ విధానాన్ని ఉపసంహరించుకుని.. టీచర్లు, ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికి వరంగా, మరికొందరికి శాపంగా మారిందని రేవంత్ అభిప్రాయపడ్డారు. విభజన, ట్రాన్స్ఫర్లలో కొత్త జిల్లాలవారీగా స్థానికతను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ కారణంగా బదిలీల్లో టీచర్లపై ఎక్కువ ప్రభావం పడుతోందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తర్వాత కొత్త గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్ ఫర్లు చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు జీవో నెంబర్ 3 ప్రకారం జరిగాయని.. ప్రస్తుతం కూడా అలాగే చేపట్టాలని అన్నారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని లేఖలో కోరిన రేవంత్.. అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని సూచించారు.