ఎలాంటి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. అట్టడుగు స్థాయి నుండి రాజకీయం మొదలుపెట్టి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా విజయం సాధించి ప్రజా ప్రతినిధిగా పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టారు. తన శక్తి సామర్థ్యాలతో తక్కువ కాలంలోనే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన రాజకీయ వ్యుహాలు, పదునైన విమర్శనాస్త్రాలతో అనతి కాలంలోనే పెద్ద నేతగా గుర్తింపు పొందారు.
పొలిటికల్ కెరీర్లో ఎన్నో సవాళ్లు, కేసులు ఎదురైన భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారు. జైలు జీవితం కూడా గడిపారు. అయినప్పటికీ చెక్కు చెదరని మనో ధైర్యంతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే తెలంగాణ సీఎం, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి. ఇవాళ (నవంబర్ 8) సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. సీఎం హోదాలో ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి కెరీర్:
1969 నవంబరు 8న తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి.. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించారు. 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో జాయిన్ అయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో రెండోసారి అదే కొడంగల్ స్థానం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018లో టీడీపీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత ఇలాకా కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి నుండి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ రెడ్డి నియమాకం అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి.. అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్నారు.
రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్తో సై అంటే సై అనేలా తలపడ్డారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు ధీటుగా.. వ్యూహాలు రచించి.. 2023 నవంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో క్రియా శీలక పాత్ర పోషించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను చిత్తు చేసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి వీరోచిత పోరాటం చేశారు. రేవంత్ రెడ్డి కష్టానికి ప్రతిఫలంగా పార్టీ హై కమాండ్ ఆయనకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యి.. తన సత్తా ఎంటో ప్రపంచానికి చాటి చెప్పారు.
హ్యాపీ బర్త్ డే రేవంతన్న: బర్త్ డే విషెస్
మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంత్రి సీతక్క ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్ డే రేవంతన్న’ అంటూ మంత్రి సీతక్క, ఇతర నేతలు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రేవంత్ అన్న బర్త్ డే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నందున రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో నిర్వహించుకోలేకపోతున్నామని క్లారిటీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని.. శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆకాక్షించారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పలువురు మంత్రులు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలియాజేశారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాక్షించారు.
రాష్ట్రంలో విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలపై శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో పేదలు రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీఎంకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.