ఇక రేవంత్​ పాలన పరుగెత్తాలి..

ఇక రేవంత్​ పాలన పరుగెత్తాలి..

 తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది.  మొత్తానికి అంధకారంలో ఉన్నవాళ్లు ఎవరిని బరిలోకి లాగగలరో పార్లమెంటు  ఎన్నికలు తేల్చేస్తాయి. ఎవరిని ‘దింపాలో,  లేపాలో’ అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయిస్తుందని ఈ ఎన్నికలు తేల్చాయి. గతంలో కేసీఆర్​ తన వ్యవస్థలను, చాతుర్యాన్ని ఉపయోగించి బరిలో ఎవరు ఉండాలనేది నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే.  

అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని రేవంత్​ రెడ్డి అనివార్యంగా, అనూహ్యంగా  తన ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకొన్నారు.  ఎన్నికలవ్వగానే  సీఎం రేవంత్​ పాలనపై దృష్టి పెడదాం అన్నమాట ప్రస్తావించారు. అయితే, రేవంత్​కు అధికారం నల్లేరుపై నడకలా, పూలబాటగా వచ్చినా  ముళ్లకిరీటం తలమీద ఉన్న విషయం మర్చిపోకూడదు.

కేసీఆర్​ను అధికారం లేకుండా ఉంచడం కొన్ని వర్గాలకు ఇష్టంలేదు. ఆ ఎకోసిస్టం ఇప్పుడు మెల్లమెల్లగా  కాంగ్రెస్​లో  మోపు అవుతున్నారు. అలాగే, లెఫ్ట్​ వింగ్ అంతా పాత కాంగ్రెస్​లాగే భావిస్తూ తమ వాద్య సంగీతం అందిస్తున్నారు. అలాగే మళ్లీ ఎంఐఎం  కూడా కాంగ్రెస్​ వైపు చూస్తున్నది. కాంగ్రెస్​ కూడా వాళ్లవైపు ఆశగా చూస్తున్నది. ఇదంతా కేసీఆర్​ చుట్టూ చేరిన బృందమే.

 కేసీఆర్​ అధికారం కోల్పోయేవరకు వీళ్లంతా అక్కడ  స్తోత్ర పాఠాలు చెప్పినవాళ్లే.  రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశంపై రేవంత్​రెడ్డిని, చివరకు రాహుల్​గాంధీని కూడా  మార్క్కిస్టులే తప్పుదారి పట్టించారని ఢిల్లీలో చర్చ.  కేసీఆర్​లాంటి మాయల మరాఠీకే తెలంగాణ ప్రజలు పాఠం నేర్పించారన్న విషయం ఇటీవల చరిత్ర.  కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో ఆదర్శం చూపించాలి. గత ప్రభుత్వం అహంకార పూరితంగా చేసిన తప్పులు సరిదిద్దాలి. 

జిల్లాల పునర్విభజన తక్షణ కర్తవ్యం

గత ప్రభుత్వం ఇష్టారీతిన, అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి. ఇటీవల జిల్లాలు రద్దయితాయి అని అక్కడక్కడా బీఆర్ఎస్​ గొంతులు వినిపించాయి.  కానీ, జిల్లాలు అనవసరంగా ఏర్పాటు చేశారని చాలామంది  ప్రజల అభిప్రాయం.  కొందరు తమ ఆస్తులు పెంచుకోవడం కోసం జిల్లాల విభజన చేయించారు.  ఒక నాయకుడు తన బావమరిదికి కొత్త నియోజకవర్గం కోసం ఓ మండలాన్ని జిల్లా నుంచి విడదీశాడు.

అలాగే, తమకు ఇష్టంలేని నాయకుల ప్రాధాన్యత తగ్గించేందుకు కొన్ని మండలాలను ముక్కులు చేశారు. సంగారెడ్డికి, వికారాబాద్​కు 15నిమిషాల్లో చేరుకోగల శంకరపల్లిని రంగారెడ్డిలో కలిపారు. కొంగరకలాన్​ దగ్గరున్న కలెక్టేరేట్​కు శంకరపల్లి నుంచి వెళ్లాలంటే నేరుగా బస్సు లేదు. వికారాబాద్ జిల్లాకు ఆదాయం బాగానే ఉన్నా షాబాద్, శంకరపల్లి, మొయినాబాద్,  చేవెళ్లను విడదీసి విధ్వంసం చేశారు.

ఇజ్రాయెల్​ దేశమంత పెద్దగున్న పాత మహబూబ్​నగర్​ జిల్లాను కుక్కలు చింపిన  విస్తరి చేశారు. ఇందులో ఏ ప్రమేయంలేని ఉద్యోగులను 317 జీవో తెచ్చి చెట్టుకొకర్ని పుట్టకొకర్ని చేశారు. ఓ ఉన్నతాధికారి, జోకుడు ఉద్యోగ సంఘాలను పెట్టుకుని ఎన్నో కుటుంబాల్లో విధ్వంసం సృష్టించారు. భారత్​– పాక్​ విభజన జరిగినప్పుడు కాందీశికుల్లా ఉద్యోగుల పరిస్థితి కల్పించిన కేసీఆర్​వాళ్లను తీవ్రంగా అవస్థలు పాల్జేశాడు.  కాబట్టి  సీఎం వెంటనే ఒక నిష్పాక్షిక కమిటీ ద్వారా జిల్లాలను కుదించి ఇప్పటి పార్లమెంటు నియోజకవర్గాలను ఓ జిల్లాగా చేయాలి.  పాత పది జిల్లాలు ఇరవై చేస్తే చాలు. 

 ఫ్రెండ్లీ పోలీసు కాదు, నైతిక పోలీసు కావాలి

ప్రభుత్వాలు ధరణిలాంటి సమస్యలు సృష్టించి ప్రజల్ని ఆఫీసులు చుట్టూ తిప్పుతుండటం సరైంది కాదు. భూ తగాదాల్లో మితిమీరిన పోలీసు జోక్యం వల్ల న్యాయ స్థానాల సుదీర్ఘ విచారణ వల్ల, రాజకీయ జోక్యం వల్ల సమాజం అశాంతిలో ఉంది. దీనికి ముగింపు పలకాలి. ఫ్రెండ్లీ పోలీస్​ పేరుతో గత ప్రభుత్వం విచిత్రమైన సర్కస్​ చేసింది. నిజంగా నేరం అరికట్టడంలో వైఫల్యం చెందడం, తమ అధికారానికి అనుకూలంగా పనిచేసేట్లు చేయడం గత ప్రభుత్వం చేసిన నేరం. ఫోన్​ ట్యాపింగ్​ ఇష్యూ ఒక అంతర్జాతీయ నేరం.

ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ జోక్యం లేని నైతిక పోలీస్​ వ్యవస్థగా తీర్చిదిద్దాలి. అలాగే మద్యం పాలసీ వల్ల కుటుంబ జీవనం దెబ్బతిన్నది. డ్రగ్స్​రాకెట్స్​పై ఉక్కుపాదం మోపాలి. గత ప్రభుత్వం సంపదను కొన్ని జిల్లాల్లో మాత్రమే ఖర్చు పెట్టింది. దానివల్ల అభివృద్ధి ప్రాజె
క్టులు పాలమూరు లాంటి జిల్లాలో కునారిల్లి పోయాయి. సీఎం రేవంత్​ రెడ్డి పాలన సుదీర్ఘంగా కొన సాగాలంటే కొన్ని విషయాల్లోనైనా ఆయన మార్కు ఆదర్శం అవసరం. కేవలం రాజకీయం అంటే కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. 

గత ప్రభుత్వ ఘోర తప్పిదాలు

తెలంగాణ సీఎం నెలజీతం 4,10,000, ఎమ్మెల్యేల నెల జీతం 2,50,000. అదనంగా అలవెన్సులు, ఖర్చులు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ. ఉద్యోగులకు మాత్రం ఎన్నికల ముందు 5శాతం పీఆర్​ ప్రకటించడం ఆ వర్గాల్లో బాధ కలిగించింది. బీఆర్ఎస్​ హయాంలో 8వేల పైచిలుకు రైతుల ఆత్మహత్యలు జరిగినా ఒక్క బాధిత కుటుంబాన్నీ పరామర్శించలేదు.

కానీ, పంజాబ్​ వెళ్లి అక్కడి రైతులకు డబ్బు పంచి వచ్చారు. కేసీఆర్​ సర్కారు బీసీ శాఖ కింద సుమారు 11ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్​లో నిధులు శూన్యం. కోట్ల రూపాయల కులభవనాలు కట్టి బీసీ కులాల నిధులకు మాత్రం గ్రహణం పట్టించారు. 2014‌‌‌‌‌‌‌‌–15 నుంచి 2019 వరకు నిధులు కేటాయించినట్లే చేసి అది అంకెల్లో మాత్రమే కనిపించింది. 2019–20లో అసలు నిధులే కేటాయించలేదు. 2020–22 వకు 1000 కోట్లు ఇస్తామన్నా రూపాయి విదల్చలేదు. 

లక్ష కోట్ల కాళేశ్వరం లావు ఎక్కువ– బరువు తక్కువ

గొప్ప కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చేవేళ్ల– ప్రాణహితను మింగేసింది. ఇది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద జలాశయ నిర్మాణ స్కామ్​ అయింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాలు 70 మండలాల పరిధిలో 8,83,945 హెక్టార్లకు సాగునీరు అందే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇక 317 జీవో గుదిబండ గురించి చెప్పాలంటే.. కేసీఆర్​ కుటుంబం ఏ జిల్లాలోనైనా పోటీ చేయడానికి అర్హత పొంది ఉన్నారు.

కానీ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులను తన సొంత జిల్లాకు పరాయివాళ్లను చేశారు. 1975లో జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారా 674, 728, 729 జీవోల ద్వారా ఏపీ మొత్తం 6 జోన్లు కాగా తెలంగాణ 5,6 జోన్లలో ఉండేది. ఎలాంటి అధ్యయనం లేకుండా జోన్లు, మల్టీజోన్లు కొందరు అస్మదీయులు తెలిపితే రూపొందించి ఉద్యోగుల ఉసురు పోసుకున్నారు.

కాగా, సమర్థంగా, నిజాయితీగా పనిచేసే ఐఏఎస్​లను కాళ్లు మొక్కే స్థితికి రావడం, హద్దులు దాటడం చూశాం. భూముల విలువ ఎక్కువ ఉన్న జిల్లాలో ఒక్క డైరెక్టు రిక్రూట్​ లేకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పు. గతంలో  జీపీ రావు, ఏవిఎస్​ రెడ్డి, గుల్జార్​, ఆశామూర్తి వంటి ఎందరో ఐఏఎస్​లు నిజాయితీగా ఇక్కడే పనిచేశారు. కానీ, గత ప్రభుత్వం ఐఏఎస్​లను ‘అయ్యా ఎస్’​లుగా మార్చడం విడ్డూరం. 

విద్యావిధానంలో  మార్పురావాలి

గత ప్రభుత్వం గురుకులాల పేరుతో మిగతా వ్యవస్థను సవతి తల్లిలా చూసింది. పదేండ్లలో ఒక్క విశ్వవిద్యాలయ ఆచార్యుడి పోస్టు భర్తీ చేయలేదు. నియమించిన వీసీలపై ఆరోపణలు, కేసులు అందరూ చూశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ పాఠశాలలో కూడా ఎంట్రన్స్ టెస్ట్​ పెట్టకుండా విద్యార్థులకు సీట్లివ్వాలని ప్రైవేటు విద్యావ్యవస్థను ఆదేశిస్తది.

కానీ, అందుకు భిన్నంగా గురుకుల, మోడల్​ స్కూళ్లకు టెస్టులు పెట్టి మెరిట్ విద్యార్థులను అందులోకి తీసుకుని, రోజువారీ పాఠశాలలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే అన్ని కులాలు కలిసి చదుకోవాల్సిన పాఠశాలలు కులాలవారీగా నిర్వహించడం ఆరోగ్యదాయకం కాదు. అందరూ కలిసి ఉండాల్సిన సమాజంలో కులాలవారీగా గురుకులాలు ఉండడం వల్ల బయటకొచ్చాక కులాలకు శాశ్వతత్వం ఇచ్చినట్లుగా ఉంది.

‘కులంపేరుతో ఏ జాతినీ, నీతిని నిర్మించలేం’ అని మళ్లీ కులాల పేరిట గురుకులాలు నిర్వహించడం శోచనీయం. సీఎం రేవంత్​రెడ్డి చెప్పినట్లు ప్రతి మండల కేంద్రంలో వందల ఎకరాల్లో సమగ్ర విద్యాకేంద్రాలను ఏర్పాటు చేయాలి. అన్ని కులాలవారికి అందులో ఒకే విధమైన వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో చదివే విద్యార్థులకు బస్సు లేదా రవాణా సౌకర్యం సరిగ్గా ఏర్పాటు చేయాలి. నైతిక విద్య, నైతిక జీవనంపై ప్రభుత్వం ఎంతో కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. 

- డా. పి.భాస్కర యోగి,సోషల్​ ఎనలిస్ట్​