రేవంత్, సంజయ్.. ఆర్ఎస్​ బ్రదర్స్.. రేవంత్​కు సంజయ్​రక్షణ కవచంలా ఉన్నరు: కేటీఆర్​

రేవంత్, సంజయ్.. ఆర్ఎస్​ బ్రదర్స్.. రేవంత్​కు సంజయ్​రక్షణ కవచంలా ఉన్నరు: కేటీఆర్​
  • ఆర్​ఆర్​ ట్యాక్స్​వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
  • కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ​రక్షణ కవచంలా ఉంటున్నారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ని అంతా ఆర్ఎస్​ బ్రదర్స్​ అంటున్నారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్​ రెడ్డి ఆర్​ఆర్​ ట్యాక్స్​ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారని, అలాంటప్పుడు సంజయ్​కి చేతనైతే ఆర్​ఆర్​ ట్యాక్స్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు.

రేవంత్​ రెడ్డిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదని ప్రశ్నించారు. బీజేపీలో చేరుతానని రేవంత్​ రెడ్డి ఏదైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్​ టెండర్లలో రేవంత్​ బావమరిది స్కాం చేసినా కేంద్రం ఎందుకు కాపాడుతున్నదని నిలదీశారు. పొంగులేటిపై ఈడీ దాడి చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సుంకిశాల ప్రమాదంలోనూ రేవంత్​ ఎవరిని కాపాడుతున్నారో తెలుసన్నారు.  

కృష్ణా జలాలపై లేఖ రాసి చేతులు దులుపుకున్నరు

కృష్ణా జలాలపై సీఎం రేవంత్​ కేవలం ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నారని కేటీఆర్​అన్నారు.కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సీఎం ఉద్యోగం పోతుందని రేవంత్​ భయపడుతున్నారని అన్నారు. రేవంత్​అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తెలంగాణ దివాళా తీస్తుందని విమర్శించారు. సొంత రాష్ట్రానికి క్యాన్సర్​ వచ్చిందని చెప్పిన దివాళాకోరు సీఎం రేవంత్​ రెడ్డి ఒక్కరేనన్నారు.

కానీ, కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం.. రేవంత్​ పాలనలోనే దివాళా తీసిందని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాస్తవాలు చెప్పారని కేటీఆర్​ అన్నారు. అప్పులపై రేవంత్​ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్​స్టాటిస్టికల్​ అట్లాస్​ నివేదికలో ఒప్పుకున్నదన్నారు. కేసీఆర్​కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ రిపోర్టును ప్రభుత్వం వెబ్​సైట్​ నుంచి తొలగించిందన్నారు. రేవంత్​ తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతోనే రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్​అన్నారు.