
- జైకా కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం, మెట్రో ఎండీ
- సీఎంతో పాటు జపాన్ కు వెళ్లిన మెట్రో ఎండీ
- సెకండ్ ఫేజ్ ‘పార్ట్ ఏ’ నిధుల్లో 48 శాతం అంతర్జాతీయ సంస్థలవే..
- 2 శాతం వడ్డీకి లోన్లు తెచ్చేలా యాక్షన్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: మెట్రో సెకండ్ ఫేజ్ కు నిధుల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మెట్రో ఫోకస్పెట్టింది. ఒకవైపు కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న మెట్రో సెకండ్ ఫేజ్ ‘పార్ట్ ఏ’ డీపీఆర్ ల ఆమోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.
ఇందులో భాగంగానే జపాన్ కు చెందిన ‘జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ’(జైకా)తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో జైకా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మెట్రో ఎండీ కూడా ఒకరోజు ముందుగానే జపాన్ చేరుకున్నారు. చర్చలు సక్సెస్అయితే.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అవసరమైన నిధులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈసారి ఆర్థిక భారం లేకుండా ప్లాన్..
మెట్రో సెకండ్ ఫేజ్ ‘పార్ట్ ఏ’లో ఐదు కారిడార్లను 76.4 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు రూ.24,269 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరో 18 శాతం (రూ.4,230 కోట్లు) కేంద్రం భరించాల్సి ఉంది. 4 శాతం(రూ.1033 కోట్లు) నిధులను పీపీపీ విధానంలో సేకరించనున్నారు.
మిగతా 48 శాతం (రూ.11,693 కోట్లు) నిధులను వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి లోన్ల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. జపాన్కు చెందిన జైకా ఇండియాలో ఢిల్లీ, ముంబై మెట్రో, ఇతర ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది. ఆ సంస్థ నుంచే 2 శాతం వడ్డీకి లోన్లను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
జైకాతో పాటు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, న్యూడెవలప్ మెంట్ బ్యాంక్, మల్టీ లెటరల్ డెవలప్ మెంట్ బ్యాంకుల నుంచి ఫండ్స్సేకరించాలని నిర్ణయించింది. అయితే, జైకా తప్ప మిగతా సంస్థలతో చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ ఫేజ్ లో ఇండియన్ బ్యాంకుల నుంచి 9 నుంచి 10 శాతం వడ్డీకి లోన్లు తీసుకోవడంతో మెట్రోపై అధిక ఆర్థిక భారం పడిందని మెట్రో అధికారులే పలుమార్లు ప్రస్తావించారు. అందుకే ఈసారి కేంద్ర ప్రభుత్వ సావరిన్ గ్యారెంటీతో తక్కువ వడ్డీకే లోన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.