
- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చోద్యం చూస్తున్నరు: హరీశ్‌రావు
- చంద్రబాబును, కేంద్రాన్ని అడిగే దమ్ము రేవంత్‌కు లేదు
- కేఆర్ఎంబీ ఆఫీసు ముందు ధర్నా చేద్దామంటూ సవాల్
- ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో
- సర్కారు ఫెయిల్ అయిందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాలను ఏపీ ఎత్తుకెళ్లిపోతున్నా రాష్ట్ర సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఏపీ నీళ్లెత్తుకెళ్లిపోతుంటే.. ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్ మాత్రం నీళ్లు నములుతున్నారని అన్నారు. ఇప్పటికీ ఏపీ నీటిని తీసుకెళ్తున్నా కాంగ్రెస్సర్కారు గుడ్లు అప్పగించి చూస్తున్నదే తప్ప ఏం చేయలేకపోతున్నదని కామెంట్ చేశారు. రాష్ట్రానికి అంత నష్టం జరుగుతున్నా.. పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
గురువారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నా.. ప్రభుత్వం చేవచచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకుని చూస్తున్నదని అన్నారు.
కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలైతే.. ఇప్పటివరకు 657 టీఎంసీలు తరలించినా నోరు పెగలదా? అని ప్రశ్నించారు. గత 25 రోజుల్లోనే ఏపీ 60 టీఎంసీలను తరలించిందని అన్నారు. ఈ ఏడాదికి కృష్ణాలో 1,010 టీఎంసీల నీళ్లొస్తే.. ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీల నీటి ఒప్పందాలు జరిగాయన్నారు. ఏపీకి ఇంకా 9 టీఎంసీలే మిగిలి ఉన్నాయని, తెలంగాణకు మరో 123 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. తెలంగాణ ప్రజల పాలిట పెనుశాపమని పేర్కొన్నారు.
చంద్రబాబును అడిగే ధైర్యం లేదా?
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశంపై కాంగ్రెస్ ఫెయిల్ అయిం దని హరీశ్ ఆరోపించారు. ప్రాజెక్టు మన చేతిలో ఉంటే ఏపీ రోజూ 10 వేల క్యూసెక్కులు తీసుకెళ్లలేదు కదా అని అన్నారు. ‘‘చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉండడంతో ఏపీకి నీటి తరలింపు సులువు అవుతున్నది. రేవంత్..ఇంత జరుగుతున్నా నీ గురువు చంద్రబాబును అడిగే ధైర్యం నీకు లేదు. ఇటు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదు. విపక్షాల మీద మాత్రం వికారపు భాషలో జానెడు ఎగురుతవు.
తెలంగాణ సాగు నీటి, తాగు నీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో కలిపి 100 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అవన్నీ మనకు దక్కాల్సినవే. సాగర్ ఎడమ కాల్వ కింద4 తడులు ఇస్తేగానీ పంటలు పండవు. అందుకు దాదాపు 30 నుంచి 35 టీఎంసీల నీళ్లు కావాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సాగర్‌పైనే ఆధారపడి ఉంది’’ అని అన్నారు.
ధర్నా చేద్దాం పద
ఏపీ జలదోపిడీని తక్షణం అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ ఆఫీసు ముందు ధర్నా చేద్దాం పదండి అని కాంగ్రెస్‌నేతలకు సవాల్ చేశారు. అఖిలపక్షాన్ని తీసుకుని పోతే మద్దతిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు ఎండే పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే.. సభను దద్దరిల్లేలా చేసేవారన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 మంది ఎం పీలున్నా.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిప డ్డారు. కేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసే సత్తా కూడా రేవంత్‌కు లేదని అన్నారు. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా? ఏపీ కంట్రోల్లో ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏపీ జలదోపిడీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకూ అనుమతులు సాధించలే
ప్రాజెక్టుల అనుమతులు సాధించడంలో రాష్ట్ర సర్కారు ఫెయిల్ అవుతున్నదని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చనాక– కొరాట, చిన్న కాళేశ్వరం, గూడెం ప్రాజెక్టు సహా ఎన్నింటికో అనుమతులు తెచ్చామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకూ అనుమతులు సాధించడం లేదన్నారు.
‘‘డీపీఆర్‌లు వాపస్ వస్తున్నాయి. పాలమూరు ప్రాజెక్టు, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీ డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. సీతమ్మసాగర్కు మేమే అన్ని అనుమతులు తెచ్చాం. చివరి అనుమతి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ తిరస్కరించింది. సమ్మక్కసాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఉద్దేశపూర్వంగా పండబెట్టారు.
కాళేశ్వరం కూలిపోయిందని దొంగ ప్రచారం చేశారు. కాళేశ్వరంలో అనేక భాగాలున్నాయి. అందులో ఒకటి మేడిగడ్డ. అందులో ఏడో బ్లాకులో ఒక్క పిల్లర్ కుంగింది. దాన్ని రిపేర్ చేయకుండా చోద్యం చూస్తున్నారు. కుట్రతో రిపేర్లు ఆలస్యం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. గట్టిగ చేస్తే ఆరు నెలల్లో రిపేర్లు పూర్తవుతాయి’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.