కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కామారెడ్డి కొత్త మున్సిపాలిటీ మాస్టార్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల.. కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ విషయంలో మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా.. వారి అభిప్రాయం సేకరించకుండా ఎలా అమలు చేస్తారని రేవంత్ ప్రశ్నించారు. రైతుల ఉద్యమం నెల రోజులుగా నడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టర్‌తో చర్చించేందుకు వస్తే.. కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ఏంటని రేవంత్ నిలదీశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి రైతులు ఆందోళన విరమింపజేసే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలన్నారు. అలాగే... రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి.. ప్రజా సభలలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలని రేవంత్ పేర్కొన్నారు.