రాహుల్ సభను సక్సెస్ చేయాలని సన్నాహక సమావేశం
వివాదాస్పదంగా మారిన ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు
నల్గొండ , వెలుగు : పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల 6న వరంగల్‌లో జరగనున్న రాహుల్ సభను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా పార్టీ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం సాగర్‌లోని రెడ్డి సత్రంలో నిర్వహించనున్నారు. సమావేశానికి ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మండల, జిల్లా పార్టీ నాయకులు హాజరు కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరారు. అయితే రేవంత్ రెడ్డి రాకను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘జిల్లాకు రేవంత్ రాక అవసరం లేదు, ఈ జిల్లాలో పార్టీని బలోతం చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి పనిచేస్తాం, పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలను రేవంత్ చూసుకుంటే సరిపోతుంది’ అని కోమటిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌లో జరిగే మీటింగ్‌కు భువనగిరి పార్లమెంట్, నల్గొండ నియోజక వర్గం నుంచి కోమటిరెడ్డి అనుచరులు వస్తారా అన్నది సందేహంగా మారింది. రేవంత్ సభకు దూరంగా ఉంటామని నల్గొండ నియోజకవర్గంలోని కోమటిరెడ్డి వర్గీయులు ఇప్పటికే చెబుతున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా వెంకట్‌రెడ్డి బాటలోనే నడిస్తే అప్పుడు పరిస్థితులు మరో రకంగా ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న కోణం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల నుంచి మీటింగ్‌కు వెళ్లేందుకు పార్టీ నాయకులు రెడీ అవుతున్నారు.
జానారెడ్డి మంత్రాంగం ఫలించేనా ?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి జోక్యం చేసుకున్నాకే రేవంత్ రాక ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో జానారెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది సస్పెన్స్‌గా మారింది. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి మీటింగ్‌కు వస్తేనే పార్టీలో జోష్ ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో మీటింగ్ చివరి నిమిషం వరకు ఎలాంటి పరిణామాలైన చోటుచేసుకోవచ్చని పార్టీ వర్గీయులు చెపుతున్నారు.