పాలమూరు జిల్లాపై .. రేవంత్​ డైరెక్షన్​.. మల్లు యాక్షన్

పాలమూరు జిల్లాపై ..  రేవంత్​ డైరెక్షన్​.. మల్లు యాక్షన్
  • ఉమ్మడి పాలమూరుపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నాలు
  • మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల లీడర్లతో మంతనాలు
  • అధికారంలోకి వస్తే నామినేటెడ్​ పదవులు ఇస్తామని హామీలు

మహబూబ్​నగర్​, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాపై టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫుల్​ ఫోకస్​ పెట్టారు.  సొంత నియోజకవర్గమైన కొడంగల్​ సెగ్మెంట్​ నుంచి పోటీ చేస్తున్నట్లు కన్ఫాం చేయడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో మెజార్టీ సీట్లను సాధించాలని స్కెచ్​వేశారు. తన డైరెక్షన్​లోనే జిల్లాకు చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని యాక్షన్​లోకి దింపారు. ఆయన ద్వారా మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లలో పలుకుబడి, బలం ఉన్న లీడర్లను కాంగ్రెస్​లోకి తీసుకొచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు.

ఇప్పటికే జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరితను పార్టీలోకి తీసుకురావడంలో కీ రోల్​ పోషించారు. అలాగే నాగర్​కర్నూల్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి కుమారుడు రాజేశ్​ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికితోడు 'పాత, కొత్త' లీడర్ల మధ్య ఉన్న పంచాయితీలు సద్దుమణిగేలా చేసి, రానున్న ఎన్నికల్లో  కలిసికట్టుగా పని చేయాలనే 'కర్ణాటక' ఫార్ములాను రేవంత్​ తెరముందుకు తెస్తున్నారు.

సీతా దయాకర్​రెడ్డితో చర్చలు

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్​రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు కొద్ది రోజులు గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట హైదరాబాద్​లో ఆమెను మల్లు రవితో పాటు మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి , రేవంత్​రెడ్డి సోదరుడు కొండల్​రెడ్డి  కలిసి పార్టీలోకి రావాలని కోరారు. అయితే ఆమె మక్తల్​ అసెంబ్లీ టికెట్ కోరినట్లు తెలిసింది. కానీ పార్టీ హైకమాండ్​ మాత్రం దేవరకద్ర టికెట్​ ఆఫర్​య చేసినట్లు సమాచారం. మక్తల్​ సెగ్మెంట్​ నుంచి ఇండిపెండెంట్​గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

బీసీ లీడర్​ను తిరిగి రమ్మంటున్నారు..

గతంలో కాంగ్రెస్​లో ఉండి బీజేపీలో చేరిన మహ బూబ్​నగర్​ నియోజకవర్గానికి చెందిన బీసీ లీడర్ ఎన్పీ వెంకటేశ్​ను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ లీడర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నియోజకవర్గంలో 53 శాతం ఓటర్లు బీసీలే ఉన్నారు. పాలమూరు సెగ్మెంట్​లో అత్యధికంగా ఉన్న  ముదిరాజ్​ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్​ను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవచ్చనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వెంకటేశ్​ను తీసుకొని మల్లు రవి, చిన్నారెడ్డి  హైదరాబాద్​లో రేవంత్ ను కలిసినట్లు సమాచారం. సర్వేలు, పొలిటికల్​ ఈక్వేషన్స్​ ప్రకారం ఈ సెగ్మెంట్​ నుంచి ఆయనకు టికెట్​ ఇచ్చే చాన్స్​ కూడా ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

మరికొందరి కోసం ప్రయత్నాలు..

దేవరకద్ర నుంచి గతంలో రెండు సార్లు కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన ఓ లీడర్​ బీజేపీలో చేరారు. ఆయనను తిరిగి కాంగ్రెస్​లోకి తీసుకొచ్చేందుకు దాదాపు రెండు నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్​ నిర్వహించిన సర్వేల్లో ఆయనకు ఓటర్లలో సానుభూతి ఉండటంతో పాటు రానున్న ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇస్తారని తేలింది. దీంతో ఆయనను కాంగ్రెస్​లోకి తీసుకొచ్చేందుకు మంతనాలు జరుపుతున్నారు.

ఈయనతో పాటు గతంలో మహబూబ్​నగర్​ జిల్లాలో పోలీస్​ ఆఫీసర్​గా పని చేసిన ఓ అధికారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరితో పాటు గతంలో కాంగ్రెస్​లో పని చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన లీడర్లను కలుస్తున్నారు. తిరిగి కాంగ్రెస్​ కోసం పని చేయాలని కోరుతున్నారు. అధికాంలోకి వస్తే పదవులు ఇప్పిస్తామంటూ మాట కూడా ఇస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారికి సైతం కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నామినేడెట్​ పదవులు ఇప్పిస్తామనే హామీలు ఇస్తున్నట్లు సమాచారం.