కొందరు తెరపై నటిస్తారు. మరికొందరు నటనలో జీవిస్తారు. రేవతి ఈ రెండో కోవకి చెందుతారు. కేరళలో పుట్టి.. తమిళనాట ఎదిగిన ఆమె.. తెలుగు, హిందీ చిత్ర సీమల్లోనూ ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ తన పర్‌ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తూనే ఉన్నారు. నటనకు నిలువెత్తు నిర్వచనమై నిలిచిన రేవతి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలు మీ కోసం..
అసలు పేరు ఆశ..
రేవతి అసలు పేరు ఆశ. 1966లో కేరళలోని కొచ్చిలో జన్మించారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. మలయాళ నటి గీతా విజయన్ వారికి దగ్గర చుట్టం. రేవతి స్కూల్లో ఉన్నప్పుడే ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఆరోజు తీసిన గ్రూప్ ఫొటోని ఓ ఫేమస్ తమిళ మ్యాగజీన్ కవర్ పేజీపై వేశారు. అందులో రేవతిని చూసిన దర్శకుడు భారతీ రాజా.. తాను తీయబోతున్న కొత్త సినిమాలోని హీరోయిన్ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుందని ఫీలయ్యారు. వెంటనే రేవతి ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడం, వాళ్లు సరే అనడం, భారతీరాజా తీసిన ‘మన్ వాసనై’ అనే తమిళ మూవీతో రేవతి ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
నటనకే నిర్వచనం
రేవతి ఎంత గొప్ప నటి అనేది మొదటి సినిమాతోనే అందరికీ తెలిసిపోయింది. ఆ మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకున్నారామె. దాంతో వెంటవెంటనే అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాతి సంవత్సరం ఐదు సినిమాల్లో నటించారు రేవతి. ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఏకంగా పదమూడు సినిమాలు రిలీజయ్యాయి తనవి. ఆ మరుసటి సంవత్సరం ఏడు సినిమాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత త్వరగా స్టార్‌డమ్ సంపాదించారో. అల్లరి పిల్లగా, ప్రేమలో ఓడిన ప్రేయసిగా, కుటుంబ భారాన్ని మోసే గృహిణిగా, అమాయక పల్లెటూరి పడుచుగా.. ఏ పాత్ర చేసినా ద బెస్ట్ ఇవ్వడమే రేవతికి తెలుసు. అందుకే నాటి టాప్ డైరెక్టర్లందరికీ తనే ఫస్ట్ చాయిస్. స్టార్ హీరోలకి సైతం ఆమే బెస్ట్ పెయిర్. పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకి ఆమే కేరాఫ్.
నో బ్యారియర్స్
కళకి హద్దులు ఉండవంటారు. అందుకేనేమో.. రేవతి యాక్టింగ్ టాలెంట్ గురించి అతి తక్కువ కాలంలోనే అన్ని భాషల వారికీ తెలిసిపోయింది. రేవతి 1983లో తమిళనాటలోకి ఎంట్రీ ఇచ్చారు, అదే యేడు మలయాళ సీమలోనూ కాలు పెట్టారు. అయితే తమిళంలో బాగా బిజీగా ఉండటంతో మాతృభాషే అయినా మలయాళంలో సంవత్సరానికి ఒకట్రెండు సినిమాల కంటే ఎక్కువ చేయలేకపోయేవారు. దానికి తోడు ఆ తర్వాతి సంవత్సరమే టాలీవుడ్ నుంచి కూడా ఆహ్వానం అందింది. రేలంగి నరసింహారావు తీసిన ‘మానసవీణ’ తెలుగులో రేవతి మొదటి సినిమా. ఆ సంవత్సరమే ‘సీతమ్మపెళ్లి’ సినిమా కూడా చేశారు. చేతినిండా సినిమాలు ఉండటంతో ఆ తర్వాత నాలుగేళ్లు పట్టింది తెలుగులో నటించడానికి. ‘రావుగారిల్లు’ మూవీలో యాక్ట్ చేసిన తర్వాత తెలుగులోనూ కంటిన్యుయస్‌గా సినిమాలు చేశారు రేవతి. ప్రేమ, మృగతృష్ణ, రాత్రి, అంకురం, గాయం చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. ‘లంకేశ్వరుడు’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా కనిపించారు. బాలీవుడ్ వారికి కూడా రేవతి పరిచయమే. అక్కడ లవ్, ముస్కురాహట్, తర్పణ్ లాంటి మూవీస్ చేశారు. అయితే ఆమె ఫిమేల్ లీడ్‌గా నటించిన హిందీ చిత్రాల్లో రీమేక్సే ఎక్కువ.
సక్సెస్‌ఫుల్ సెకెండ్ ఇన్నింగ్స్
హీరోయిన్‌గా ఎంత వెలిగిపోయినా ఏదో ఒక సమయంలో గ్యాప్ రాక తప్పదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చినా.. అందరూ సక్సెస్ అవుతారన్న నమ్మకమూ లేదు. కానీ రేవతి అలా కాదు. ఆమె వెర్సటైల్ యాక్టర్. అందుకే సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. తల్ల, అత్త పాత్రలే కాక రకరకాల క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించారామె. గణేష్, ఈశ్వర్, అనుక్షణం, లోఫర్, సైజ్ జీరో, బ్రహ్మోత్సవం, ఇట్లు అమ్మ, రీసెంట్‌గా వచ్చిన ‘మేజర్’ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇతర భాషల్లోనూ ధూప్, నిశ్శబ్ద్, టూ స్టేట్స్, గుడ్‌మార్నింగ్ సన్‌షైన్, మార్గరీటా విత్ ఏ స్ట్రా, భూతకాలం, జాక్‌పాట్, పవర్ పాండి లాంటి పలు చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని అత్యద్భుతంగా పోషించారు.
అన్నింట్లోనూ భేష్
మంచి యాక్టర్ గొప్ప డైరెక్టర్ కాగలరు అనే మాట ముమ్మాటికీ నిజమేనని ప్రూవ్ చేశారు రేవతి. ఆమె మొట్టమొదటిసారి మెగాఫోన్ పట్టి తీసిన ‘మిత్రన్ మై ఫ్రెండ్’కి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇంకా ఫిర్ మిలేంగే, కేరళ కేఫ్, ముంబై కటింగ్ లాంటి మంచి సినిమాలు తీశారు. ప్రస్తుతం కాజోల్ లీడ్ రోల్‌లో ‘సలామ్ వెంకీ’ అనే మూవీ తీస్తున్నారు. చాలా సినిమాల్లో ఫిమేల్ క్యారెక్టర్స్ కు వాయిస్ ఇచ్చారు రేవతి. తమిళంలో శరణ్య, సువలక్ష్మి, కాజోల్, మహేశ్వరి, టబు, దివ్య ఉన్ని లాంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారామె. ఇక మలయాళ మూవీ ‘దేవరాగం’ సినిమాలో శ్రీదేవికి వాయిస్ ఇచ్చారు. ‘పుణ్యకోటి’ అనే సంస్కృత యానిమేటెడ్ మూవీలో ఆవు పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పారు రేవతి. ఒక సమయంలో తన సింగింగ్ టాలెంట్‌ని కూడా బయటపెట్టారామె. జి.రవి మ్యూజిక్ ఆల్బమ్ ‘తిరుప్పావై’లో పాడటంతో పాటు సుహాసినితో కలిసి నటించారు. రేవతి గ్రేట్ భరతనాట్యం డ్యాన్సర్ కూడా. ఏడేళ్ల వయసు నుంచే నాట్యం నేర్చుకున్నారు. చెన్నైలో అరంగేట్రం చేశారు. ఇప్పటికీ నృత్య ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. వ్యక్తిగానూ రేవతి ప్రత్యేకమే. ఆమె గొప్ప సామాజిక సేవకురాలు. బన్యన్, ఎబిలిటీ ఫౌండేషన్ లాంటి పలు సంస్థలతో కలిసి ఎన్నో రకాలుగా సమాజ సేవ చేస్తున్నారు.
టీవీలోనూ ఠీవిగా..
1990 నుంచి బుల్లితెరపై కూడా తన ముద్ర వేస్తూ వస్తున్నారు రేవతి. చాలా సీరియల్స్ లో నటించారు. ఇరవిల్ ఒరు పగల్, రేవతి, డాక్టర్స్, అన్బు మామన్, నిరంగళ్, చిన్న చిన్న ఆశై, అళగు లాంటి డైలీ సోప్స్ లో కీలక పాత్రలు పోషించారు రేవతి. మాయలీ హౌస్, చాంపియన్స్ లాంటి రియాల్టీ షోస్‌లోనూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది కనుక వెబ్ సిరీసులపై కూడా దృష్టి పెట్టారు. ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ అనే తెలుగు సిరీస్‌లో నటించారు. ఇది సరిగ్గా ఆవిడ పుట్టినరోజున, అంటే ఇవాళ్టి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి రావడం విశేషం.
ఎనలేని గౌరవం
నటిగా, దర్శకురాలిగా విశేష ప్రతిభను కనబర్చిన రేవతిని ఎన్నో అవార్డులు వరించాయి. మూడుసార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్నారామె. అది కూడా మూడు వేర్వేరు విభాగాల్లో. ‘క్షత్రియపుత్రుడు’కి ఉత్తమ సహాయనటిగా, ‘మిత్రై మై ఫ్రెండ్’కి డైరెక్టర్‌గా, ‘రెడ్ బిల్డింగ్ వేర్ ద సన్ సెట్స్’కి బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగానికి గాను జాతీయ అవార్డును అందుకున్నారు రేవతి. మన్ వాసనై, కక్కోతిక్కావిలే అప్పూప్పన్ తాడికల్, క్షత్రియపుత్రుడు, అంకురం, మరుపాడియుమ్, ప్రియాంక చిత్రాలకు గాను ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. ఇంకా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, స్క్రీన్ అవార్డ్, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అంటూ చాలా రకాల పురస్కారాలు లభించాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే రేవతి ఘనతలు పెరుగుతాయే తప్ప తరగవు. అయితే కెరీర్‌లో ఇంత సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయిన రేవతి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1986లో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్‌ని పెళ్లి చేసుకున్నారామె. వీళ్లిద్దరూ కలిసి ‘పద్మవ్యూహం’ అనే మూవీలో యాక్ట్ చేశారు కూడా. అయితే పెళ్లైన పదహారేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. వీరికి పిల్లలు లేరు. పర్సనల్ లైఫ్‌లో ఏ వెలితి ఉన్నా.. తన వర్క్ లో మాత్రం ఎప్పుడూ వెలితిని కనిపించనివ్వలేదు రేవతి. ఇప్పటికీ బెస్ట్ యాక్టర్‌గా, బెస్ట్ డైరెక్టర్‌గా ప్రశంసలు పొందుతూనే ఉన్నారు. ఎప్పటికీ పొందుతూనే ఉంటారు.