
- బీజేపీకి 6 నుంచి 8: పీపుల్స్ పల్స్ సర్వే
- ఎంఐఎం, బీఆర్ఎస్కు చెరో స్థానం
- ఆంధ్రప్రదేశ్‌లో కూటమిదే విజయమని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా ల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని పీపుల్స్‌పల్స్ సంస్థ పోస్ట్ పోల్స్ సర్వే లో వెల్లడిం చింది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాల్లో, బీజేపీ 6 నుంచి 8, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 0–1 స్థానాల్లో గెలుపొందే అవకాశముందని తమ సర్వేలో వెల్లడైనట్టు తెలిపింది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం ఒక స్థానంలోనే గెలిచే అవకాశం ఉందని.. అది కూడా స్పష్టంగా చెప్పలే మని పేర్కొంది. మెదక్, మహబూబ్‌నగర్, జహీరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ముక్కోణపు పోటీ -ఉంటుందని వెల్లడించింది.
శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్ దిలీప్ రెడ్డి, సీనియర్ రీసెర్చర్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పార్టీల గెలుపు అవకాశాలపై తాము చేసిన పోస్ట్ పోల్ సర్వేను రిలీజ్ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందన్నారు.
చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిచే చాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ సీటును మరోసారి ఎంఐఎం పార్టీ చేజిక్కించుకోవచ్చని చెప్పారు. అయితే, గతంతో పోల్చితే మెజార్టీ భారీగా తగ్గుతుందన్నారు. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితి ఉందన్నారు.
ఏపీలో కూటమికే జై..
ఏపీలో టీడీపీ-, జనసేన– -బీజేపీ కూటమి విజయకేతనం ఎగురవేయనుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 95 నుంచి 110 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉందని తెలిపింది. అలాగే, జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కూటమికి మొత్తంగా 111 నుంచి 135 స్థానాలు రావొచ్చని పేర్కొంది. వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. ఏపీలో వైఎస్సార్సీపీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి.
అలాగే, ఆ రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 13– 15 స్థానాల్లో, జనసేన 2, బీజేపీ 2 నుంచి 4 చోట్ల గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అంటే, కూటమి ఉమ్మడిగా 17 నుంచి 21 స్థానాల్లో గెలవొచ్చని సర్వే సంస్థ వెల్లడించింది. టీడీపీ 17 స్థానాల్లో, జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేశాయి. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్సీపీ ఈసారి 3 నుంచి 5 సీట్లకు పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపింది.