యాసిడ్ తో దాడి చేసి పరార్..
మొదటిసారి కాస్తలో తప్పించుకున్నాడని.. రెండోసారి కాపుకాసి యాసిడ్ తోనే అటాక్..
వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు యాసిడ్ తో దాడి చేసి పరార్
నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
కర్నూలు: తనను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడిపై ప్రియురాలు పగబట్టింది. వారం రోజుల క్రితం మొదటిసారి దాడి చేసినప్పుడు చేయి అడ్డంపెట్టుకుని తప్పించుకున్నాడని.. రెండోసారి కాపు కాసి.. ఒంటిపై యాసిడ్ పోసి పరారైంది. గాయపడిన ప్రియుడిని స్థానికులు సమీపంలోని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సినీ ఫక్కీలో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది.
నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన నాగన్న, తిరుపాలమ్మ దంపతుల కుమారుడు నాగేంద్ర (23) అదే గ్రామానికి చెందిన బాలు, సాలమ్మల కుమార్తె సుప్రియ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగేంద్ర అదే గ్రామంలో కిరాణ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తుండగా.. సుప్రియ ఇంటర్ వరకు చదివి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ఇరువైపులా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సుప్రియ తన ప్రియుడు నాగేంద్రకు చెప్పి.. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని నచ్చచెప్పింది. తన ప్రియురాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నాగేంద్ర తల్లిదండ్రులకు చెప్పి గత నెల 18వ తేదీన మహానందిలో పెద్దల సమక్షంలో లక్ష్మి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తరువాత గ్రామంలోని కిరాణ దుకాణంలో గుమాస్తా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. తన యజమాని తెచ్చిన గ్యాస్ సిలిండర్లను గ్రామస్తులకు సరఫరా చేయడంతోపాటు.. యజమాని చెప్పిన చిన్న చితక చెప్పిన పనులన్నీ చేస్తుంటాడు. నాగేంద్ర తన దగ్గర అవసరాల కోసం తీసుకున్న 8500 నగదు ఇవ్వమంటూ సుప్రియ గట్టిగా డిమాండ్ చేసింది. సరే నంటూ అప్పు తీర్చేశాడు. వారం రోజుల క్రితం మాట్లాడదాం రమ్మంటూ పిలిచి యాసిడ్ పోయగా చేయి అడ్డుపెట్టడంతో భుజం నుండి చేయి వరకు కాలింది. హడావుడిగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. తన ప్రియురాలే కదా.. ఆమె జీవితం ఎందుకు నాశనం చేయాలనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేసు పెట్టలేదు. ఇదే ఇప్పుడు కొంప ముంచింది. ఇవాళ ఉదయమే దుకాణం మీదుగా నాగేంద్ర రాకపోకలను గుర్తించిన సుప్రియ సిలిండర్ తీసుకుని వెళ్తుండగా అడ్డగించి మాట్లాడదామంటూ ఆపింది. తన అప్పు ఎప్పుడు తీరుస్తావంటూ మాటల్లో పెట్టి హఠాత్తుగా చేతిలో ఉన్న యాసిడ్ డబ్బాతో దాడి చేసింది. యాసిడ్ పోయడంతో తీవ్రంగా గాయపడి భయంతో కేకలు వేసి అల్లాడిపోయాడు.
స్థానికులు గుర్తించి వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం జరిగిన దాడికి అయిన గాయాలతోనే కోలుకోని నాగేంద్ర ఇవాళ మళ్లీ రెండోసారి యాసిడ్ దాడి చేయడంతో బాధతో విలవిలలాడాడు. స్థానికుల సహాయంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేకున్నా ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. బాధితుడు నాగేంద్ర, తల్లి తిరుపాలమ్మ ఫిర్యాదు మేరకు నంద్యాల తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.