మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప..పదేండ్లలో తెలంగాణలో జరిగిందిదే : మంత్రి నిర్మలా సీతారామన్

మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప..పదేండ్లలో తెలంగాణలో జరిగిందిదే : మంత్రి నిర్మలా సీతారామన్
  • రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల
  • బడ్జెట్​లో తెలంగాణపై మేం ఎలాంటి వివక్ష చూపలేదు
  • కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే
  • పదేండ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం
  • విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు : మిగులు బడ్జెట్​తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను.. పదేండ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు. అయినప్పటికీ.. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికీ కృషి చేస్తున్నామన్నారు. నిధుల కేటాయింపు, సహకారం విషయంలో అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణనూ చూస్తున్నామని, ఎలాంటి వివక్షచూపడం లేదని వివరించారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై వివరణ ఇచ్చారు. 

తెలంగాణకు చేయూత అందించేందుకు జహీరాబాద్ లో పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే, పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ స్కీంలో తెలంగాణలోని వరంగల్ కు కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్కును మంజూరు చేశామన్నారు. దీంతో కేంద్రమంత్రి ప్రసంగానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ అడ్డుతగిలారు. విభజన చట్టం హామీల అమలులో రాష్ట్రానికి అన్యాయం చేశారని నినాదాలు చేశారు. 

తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలు కోరగా.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ నిరాకరించారు. దీంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది. అయితే, కేంద్ర మంత్రి స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. డిప్యూటీ చైర్మన్ బదులిస్తూ.. విపక్ష పార్టీలు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు తీరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అనంతరం తెలంగాణకు నిధులు, రైల్వే ప్రాజెక్ట్ కేటాయింపులు, విభజన హామీల అంశాలను సభ్యులకు నిర్మల వివరించారు. 

ఇందిరా గెలిచిన మెదక్ లో ఫస్ట్ రైల్వే స్టేషన్ మేమిచ్చాం..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలి రైల్వే స్టేషన్ ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నిర్మల తెలిపారు. అలాగే, మూత పడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నడుస్తోందని వివరించారు. రామగుండం, సమ్మక్క -సారక్కకు న్యాయం చేయడం తెలంగాణకు పెద్ద సెంటిమెంట్ అంశాలన్నారు. 

అందుకు తాము అంగీకరిస్తామన్నారు. అలాగే, మరో సెంటిమెంట్ పసుపు బోర్డు అని వ్యాఖ్యానించారు. దేశంలోనే మంచి నాణ్యతతో పాటు  అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ అని చెప్పారు. ఆ నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పారు. 

విభజన హామీలు అమలు చేస్తున్నం

ఏపీ విభజన చట్టం– 2014 లోని హామీలను అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్ లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశామన్నారు. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి గడిచిన పదేండ్లలో తెలంగాణలో 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేసినట్టు వివరించారు. అలాగే, భారత్ మాల స్కీం కింద 4  గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకంలో భాగంగా రెండు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు. 

స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్​జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని సభ్యులకు వివరించారు. అలాగే, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందించినట్టు పేర్కొన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందించే 199 జనఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 

రైల్వే బడ్జెట్ లో రికార్డు స్థాయిలో కేటాయింపులు

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఏడాది తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం రూ.5,337 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. అలాగే, ఎర్రుపాలెం – నంబూరు, మల్కన్ గిరి – పాండురంగాపురం మధ్య కొత్త రైళ్లను ప్రకటించినట్టు వెల్లడించారు. గడిచిన పదేండ్లలో తెలంగాణలో 753 కిలో మీటర్రల కొత్త రైల్వే ట్రాక్ నిర్మించినట్టు తెలిపారు. 40 రైల్వే స్టేషన్స్ రీ డెవలప్ చేశామన్నారు. ఐదు కొత్త వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చినట్టు సభ ద్వారా సభ్యులకు మంత్రి తెలిపారు.