ఇంత  అసంతృప్తి అవసరమా!

ఇంత  అసంతృప్తి అవసరమా!

ఏడాది కాలంలో విపక్షానికి, ముఖ్యంగా విపక్ష నేతకు అంత అసహనమా?  రాష్ట్ర ప్రజల మేలుకోరే నాయకుడి లక్షణమేనా ఇది అని మాజీ సీఎం కేసీఆర్​ను జనం ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఏర్పడి ఏడాది దాటినా ఇంకా విపక్ష నేత,  మాజీ  సీఎం కేసీఆర్​లో  ఏర్పడిన నిర్లిప్తత సమసిపోలేదు. రెండు టర్మ్ లు యథేచ్చగా తెలంగాణ సీఎంగా పాలించిన  కేసీఆర్ ఇంకా ఆ అధికార మత్తు నుంచి దిగినట్లు కనిపించడం లేదు.  ఎప్పుడూ ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి  పేల్చే వ్యక్తులు ఇలాగే ఉంటారు అని చరిత్ర చెబుతున్నది. 

కేసీఆర్  అసెంబ్లీకి రాకుండా ఒక విపక్ష నేతగా ఆయన తన బాధ్యతలను నిర్వహించడం లేదు. పీపుల్ సమస్యల మీద చర్చించడంలేదు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఎంతోపాటుపడిన, కృషి చేసిన దివంగత మాజీ పీఎం మన్మోహన్ సింగ్  కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికీ రాకపోయే!  
బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావ్,  కేటీఆర్, ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్ప మాట్లాడేవారే లేరు.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంత ఎఫెక్టివ్​గా  ప్రతిపక్షం పాత్రలో  కనిపించడం లేదు. ఏమైనా నెక్స్ట్ మాదే  ప్రభుత్వం, మేమే అధికారంలోకి వచ్చేది అనే యావలోనే బీజేపీ నేతలు ఉన్నారు.  సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఒకే ఒక్కడుగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన మజ్లిస్ సభ్యులు కన్నా నయమే!  వారి మాటలు ఆర్భాటాలుగా కనిపిస్తున్నాయి.  నిజానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎవరైనా సరే...  వారు స్వపక్షం, విపక్షం అయినా ప్రజల గొంతుకగా చట్టసభల్లో ఉండాలి.  కానీ,ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. కేసీఆర్​ ఇప్పుడయితే  ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.  ఇదెక్కడి  ప్రజానాయకుడి లక్షణమో, విధానమో ఆయనే సమాధానం చెప్పాలి. 

స్థానిక ఎన్నికల్లో అలర్ట్ కావాల్సిందే! 

బీజేపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్​లు కలిసి ఫ్యూచర్​లో పొత్తులు అంటున్నారు. దీనికి చాలా సమయం ఉన్నది.  ఏపీలో మాదిరి టీడీపీ కూటమి తెలంగాణాలో ఉంటుందని అంటున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు  జరగనున్నాయి. ఇక అలర్ట్ కావాల్సిందే.  ఈ ఎన్నికల్లో  గెలవడం ముఖ్యమని ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డి  పార్టీ  శ్రేణులకు చెప్పారు. ఇందులో ఫలితాలు ప్రభుత్వ ఏడాది పాలన మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుపుతాయి.  ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈజీగానే  కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే  పరిస్థితి కనిపిస్తున్నది.  

Also Read : పుష్ప తొక్కిసలాట నేర్పిన పాఠాలు

సినిమావాళ్ళ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, తెలంగాణ జనంలోనే కాదు, దేశంలోనూ ప్రశంసలు అందుకున్నది.  సినిమాలు తీసినపుడు కాస్తో కూస్తో  సమాజ హితం  దృష్టి లో పెట్టుకోవాలని  హితవు పలికినట్లు అయ్యింది.  మొత్తంగా రాష్ట్రంలో  సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపైన జనంలో స్పందన పాజిటివ్ గానే కనిపిస్తున్నది.

ఏది ఏమైనా బద్నామ్ కేవలం కొంతమంది ఎమ్మెల్యేల కారణంగానే జరుగుతున్నది.  వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్తసంవత్సరం సందర్భంగా తాను మారాను. మీరు కూడా మారాలని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. విపక్షం కూడా ఎప్పుడూ అధికారం యావలో ఉండకుండా జనం ఏమి కోరుకుంటున్నారో చూసుకుని వ్యవహరించాలి.  మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి రావాలి. అసెంబ్లీకి రావాలి.  ఫక్తు ఫామ్​హౌస్ రాజకీయాలు ఎల్లకాలం పనికిరావు ఇది చరిత్ర చెబుతున్న సత్యం.  నేల మీది నిజం.

- ఎండి మునీర్,సీనియర్ జర్నలిస్ట్​-