- 15 రోజుల్లో డ్రగ్స్ మాఫియాపని పడతాం
- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నకిరేకల్, వెలుగు: ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సంక్రాంతికి ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం రాత్రి నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్స ర్యాలీకి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెయిన్ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.
కేసీఆర్ ఫ్యామిలీ, మంత్రులు ధరణి పేరుతో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములు, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దోచుకున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లు తిన్నదంతా కక్కించి ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చిచెప్పారు.
ఇంకా అధికార మత్తులోనే ఉన్నరు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా అధికారంలో ఉన్నామనే మత్తులో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పది రోజులు కాకముందే ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలపై అచ్చోసిన ఆంబోతుల్లా అసెంబ్లీలో రంకెలు వేస్తున్నారని, త్వరలోనే వారికి ముకుతాడు వేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, గంజాయి మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఫలితంగా యువత వాటికి బానిసై తల్లిదండ్రులకు దూరం అయ్యారని వాపోయారు.
15 రోజుల్లో రాష్ట్రం నుంచి ఈ మాఫియాను తరిమికొడతామని చెప్పారు. ముళ్ల కంచెలు అడ్డు గోడలు బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని, తప్పని సరిగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ నెల 28న మరో రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నామని, సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.
కక్ష సాధింపులు ఉండవ్
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. తనకు అత్యధిక మెజార్టీ కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తన పదవీకాలంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
కేవలం నకిరేకల్ అభివృద్ధి పరమావదిగా పనిచేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు దైదరవీందర్, చామల శ్రీనివాస్, పన్నాల రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.