- రూ.8,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు: పొంగులేటి
- ఏడాదిన్నరలో ‘సీతారామ’ పూర్తిచేస్తామని మంత్రి వెల్లడి
- పాలేరు, డోర్నకల్ సెగ్మెంట్లోని కాల్వలు, టన్నెల్ పనుల పరిశీలన
ఖమ్మం/ మహబూబాబాద్/ కూసుమంచి, వెలుగు : ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో రూ.2,700 కోట్లతో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తే.. బీఆర్ఎస్ మాత్రం సీతారామ ప్రాజెక్ట్‌గా పేరుమార్చి రూ.18వేల కోట్లకు అంచనాలను పెంచిందని మండిపడ్డారు. రూ.8,500 కోట్లు ఖర్చు చేసి.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు. దొరికిన దగ్గరల్లా అప్పు చేసి, ఆర్భాటంగా ప్రాజెక్టులన్నీ చేపట్టి, ఏ ఒక్క ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు తీసుకురాలేదని విమర్శించారు. ఆ తప్పులను తమ ప్రజా ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
డోర్నకల్, పాలేరు నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కాల్వలు, టన్నెల్ నిర్మాణ పనులను మంగళవారం మంత్రి పొంగులేటి పరిశీలించారు. పనులు క్వాలిటీగా చేయడం లేదంటూ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అధికారులతో రివ్యూ చేసి కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘సీతారామ ప్రాజెక్టు ఫస్ట్ లిఫ్ట్ ట్రయల్ రన్ పూర్తి చేశాం. త్వరలోనే రెండో లిఫ్ట్ కూడా ట్రయల్ రన్ చేస్తాం. ఆగస్ట్ 15 కల్లా మొదటి విడతగా ఖమ్మం జిల్లాలో లక్షా 50వేల ఎకరాలకు సాగు అందిస్తాం’’అని అన్నారు.
నీళ్ల స్టోరేజీకి రిజర్వాయర్ల నిర్మాణం
పాలేరు నియోజకవర్గంలో మున్నేరు, ఆకేరు నదుల ద్వారా ఏటా 45 నుంచి 50 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయని పొంగులేటి అన్నారు. వాటిని ఉపయోగించుకునేలా యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకంలో నీటిని స్టోరేజీ చేసుకునేందుకు రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు కానీ.. సీతారామ విషయంలో రిజర్వాయర్లు లేకుండా కేసీఆర్ తప్పుచేశారన్నారు. పాలేరు, డోర్నకల్ నియోజకవర్గాల మధ్యలో 10 నుంచి 12 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ ను ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లోనే రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామన్నారు.
పెండింగ్ పనులకు టెండర్లు పిలుస్తాం
సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఉమ్మడి వరంగల్ లో కొంత భాగం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హెడ్ వర్క్, లిఫ్ట్ పనులు పరిశీలించామన్నారు. పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందాలంటే మెయిన్ కెనాల్ పనులు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మెయిన్ కెనాల్ పనుల కోసం పూర్తిస్థాయిలో టెండర్లు పిల్వలేదని, అనేక చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటన్నింటికీ టెండర్లు పిలిచి ఆగస్టు 15లోగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు.
యువతను బీఆర్ఎస్ బలిగొంది
రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. యువతకు అన్యాయం చేసిందని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు వారి బంధువులకు ఉద్యోగాల కోసం పేపర్లు లీక్ చేయించి నిరుద్యోగులను బలిచేశారని విమర్శించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఆరు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు.