హైడ్రాకు రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు .!

హైడ్రాకు  రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు .!
  • ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల వివరాలు అడిగిన హైడ్రా చీఫ్​ 
  • సమాధానమివ్వని రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు  
  • ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరించడం లేదు. హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు ప్రభుత్వం లేక్ ప్రొటెక్షన్ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించింది. దీంతో ఆయన ఓఆర్ఆర్​లోపల ఉన్న చెరువులు, ఇతర ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడడంతోపాటు హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులకు బౌండరీలు ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నెలల కింద ఓఆర్ఆర్ లోపల ఉన్న 549 చెరువుల వివరాలివ్వాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కోరారు. చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది? ఆయా చెరువులకు లింక్ గా ఉన్న కాలువలు తదితర వివరాల రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిసింది.  

ఎఫ్‌‌టీఎల్‌‌, బ‌‌ఫ‌‌ర్ జోన్లను గుర్తించేందుకు..  

చెరువుల ఎఫ్‌‌టీఎల్‌‌, బ‌‌ఫ‌‌ర్ జోన్లను గుర్తించేందుకు హైడ్రా చీఫ్​ఇరిగేష‌‌న్‌‌, రెవెన్యూ, నేష‌‌న‌‌ల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌‌న్‌‌ సెంట‌‌ర్, స‌‌ర్వే ఆఫ్ ఇండియా అధికారుల‌‌తో సమావేశమయ్యారు. వారి దగ్గర ఉన్న డేటాతో ఓఆర్ఆర్ ప‌‌రిధిలోని ఎన్ని చెరువులు ఉన్నాయి..అవి ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయో తేల్చుకునేందుకు రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులను వివరాలు కోరారు. 45 ఏండ్ల డేటా ఆధారంగా మాగ్జిమ‌‌మ్ వాట‌‌ర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించడంతో పాటు చెరువుల ఎఫ్‌‌టీఎల్ ను శాస్త్రీయంగా నిర్ధారించడం, గ‌‌తంలో నిర్ధారించిన ఎఫ్‌‌టీఎల్ స‌‌రిగ్గా లేకపోతే స‌‌వ‌‌రించాలని అనుకున్నారు. ఈ వివరాలు అందజేయాలని కోరినా రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులు సమాధానం ఇవ్వడం లేదని తెలిసింది.  

ఉన్నతాధికారుల దృష్టికి.. 

రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వివరాలు ఇవ్వకపోవడంపై హైడ్రా చీఫ్​రంగనాథ్ సీరియస్ గా ఉన్నారు. కొన్ని రోజులు చూసి ఈ అంశాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి కూడా స్పందన రాకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.