మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద  ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  కలెక్టరేట్ సమీపంలోని సర్వే నెంబర్ 551, 255 లో ఆరు ఎకరాల భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను  రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపు చేపట్టారు. అయితే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపును నిరుపేద మహిళలు అడ్డుకున్నారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

గుడిసెల తొలగిస్తున్న సమయంలో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే వారిని గుడిసెల వైపు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితులు..పోలీసులను నెట్టేసి వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగడంతో కొందరు మహిళలు కిందపడ్డారు. పోలీసులను అడ్డుకున్న మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  మూడు నెలల క్రితం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు స్థలంలో వేలాది గుడిసెలు వెలిశాయి. అయితే ఈ గుడిసెలను గతంలో కూల్చివేయగా.. మరోసారి నిర్మించుకున్నారు. తాజాగా పోలీసులు గుడిసెలను కూల్చివేశారు. మొత్తంగా గుడిసెలను కూల్చివేయడం ఇది ఐదోసారి.