పేదల గుడిసెల తొలగింపు

నేరేడుచర్ల, వెలుగు : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను శనివారం తెల్లవారుజామున పోలీసులు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కలిసి తొలగించారు. పట్టణ పరిధిలోని జాన్ పహాడ్ - మిర్యాలగూడ బైపాస్ రోడ్డులోని సర్వే నంబర్ 244, 248 ప్రభుత్వ భూములలో మే 20న రాత్రికి రాత్రి నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. అంతకుముందు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో మూడు నెలలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేశారు. వాటిని తొలగించాలని తహసీల్దార్ అప్పుడే చెప్పారు. 

అయినా వారు అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో శనివారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవీడు, హుజూర్ నగర్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కలిసి గుడిసెలను కూల్చేశారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో తొలగింపు ప్రక్రియ సులువైంది.ప్రత్యామ్నాయం చూపాలి 
పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం అన్యాయమని, వారికి ప్రత్యామ్నాయం చూపాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయనాయుడు, బీఎస్పీ జిల్లా ఇన్​చార్జి రాపోలు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.