- ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు
- మెరుగైన పరిహారం అందించేందుకు ఆఫీసర్ల ప్లాన్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నూతనంగా చేపట్టబోయే ప్రాకారాల నిర్మాణాల కోసం రెవెన్యూశాఖ భూసేకరణ చేపడుతోంది. ఈ భూసేకరణ ద్వారా నిర్వాసితులయ్యే వారికి మెరుగైన పరిహారం అందించేందుకు అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. విలువైన భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు అంతే స్థాయిలో ఇంటికి స్థలం కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. గోదావరి బ్రిడ్జి పాయింట్‌లోని ఆర్అండ్బీ శాఖ నుంచి గతంలో ప్రసాద్ స్కీం కోసం సేకరించిన 3 ఎకరాల భూమిని ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు.
త్వరలోనే దీనిపై నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. రామాలయం అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.60.20కోట్లను భూసేకరణ కోసం 2024-25 ప్రత్యేక నిధులు జీవో నెంబర్246ను జారీ చేసిన సంగతి విదితమే. గతేడాది మార్చి 11న సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి భద్రాచలంలో రామాలయం సమగ్రాభివృద్ధి కోసం మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగాఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి వచ్చి మార్చి 27న చేపట్టే పనుల గురించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేశారు. ఆ తర్వాత పలు దఫాలుగా రెవెన్యూ, ఎండోమెంట్ ఆఫీసర్లు సర్వేలు చేసి భూసేకరణకు ప్రతిపాదనలు పంపారు.
2 సెంట్ల చొప్పున..
ఆలయం చుట్టూ సుమారు ఎకరానికి పైగా భూమిని సేకరిస్తున్నారు. దీనిలోభాగంగా 43 ఇళ్లు ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్అండ్బీ స్థలం 3 ఎకరాలు ఉంది. ఈ స్థలంలో ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇంటి కోసం ఇవ్వనున్నారు. అయితే ఆర్అండ్ఆర్ప్యాకేజీలో భాగంగా నిబంధనలను అనుసరించి ఆ ఇంటిలోని ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు, మేజర్ ఆడపిల్లలు(పెళ్లికానివారు మాత్రమే)కు అవకాశం ఇస్తారు.
స్థలంతో పాటు పరిహారం కూడా రానుంది. అలా చూస్తే సుమారు 65 మందికి ఇంటి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ-జగదల్పూర్జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలం చాలా విలువైనది కావడంతో నిర్వాసితులు కూడా ఓకే చెప్పేశారు. కలెక్టర్నుంచి అనుమతి వచ్చాక ఎంపిక చేసిన వారికి డ్రా పద్ధతిలో స్థలాలు కేటాయించే అవకాశం ఉంది. రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, తాగునీటి వసతి ఇవన్నీ ప్రభుత్వం కల్పించనుంది.
ఆర్అండ్బీ స్థలం ఓకే అయ్యింది
రామాలయం అభివృద్ధి కోసం సేకరించే భూమిలో నిర్వాసితులైన వారి కోసం గోదావరి బ్రిడ్జి పాయింట్లో స్థలం కేటాయించినం. వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వం కూడా ఆర్అండ్బీ స్థలాన్ని ఓకే చేసింది. ఇళ్లు కోల్పోతున్న వారికి ఇక్కడ ఇస్తం. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
- దామోదర్, ఆర్డీవో, భద్రాచలం