పురాతన ఆలయాల పునరుద్ధరణకు చర్యలు : శైలజ రామయ్యర్ 

ఖిలా వరంగల్/కాశీబుగ్గ, వెలుగు: శతాబ్దాల చరిత్ర కలిగి నిరాదరణకు గురైన దేవాలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వరంగల్​కోటలోని మండలమ్మ గుడి, నేలశంభుని గుడి, త్రికుటాలయాలను రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు,  వరంగల్ కలెక్టర్ సత్య శారదతో  కలిసి గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్​లో అధికారులతో మాట్లాడారు. వరంగల్ కోటలోని కాకతీయుల కాలం నాటి గుళ్లను భక్తులు దర్శనం చేసుకునేలా  పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కేంద్ర పురావస్తు శాఖకు సంబంధించిన 14  గుళ్లు, రాష్ట్ర పురావస్తు శాఖకు చెందిన దేవాలయం ఇక్కడ ఉందని అధికారులు తెలిపారు. కోటలో ఉన్న గుళ్ల ఆనవాళ్లు, ఆధారాలు సేకరించడానికి పురావస్తు, దక్షిణ తెలంగాణకు చెందిన ప్రముఖ చరిత్రకారులు, నిపుణులతో  కమిటీ  ఏర్పాటు చేస్తామన్నారు. ఆపై దేవాలయాల పునరుద్ధరణ అభివృద్ధి పనులు, దేవతమూర్తులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

అనంతరం భద్రకాళీ అమ్మవారిని శైలజా రామయ్యర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,  ఏఎస్ఐ డీఈ చంద్రకాంత్, ఏఈ కృష్ణ చైతన్య,  జేసీఏ మల్లేశం,  రాష్ట్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, ఇంటెక్ కో కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, దేవాదాయ శాఖ సహయా కమిషనర్ సునీత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.