- భూమి రాసిస్తామని రూ. 4.50 లక్షలు తీసుకున్న ఆఫీసర్లు
- మోసం చేయడంతో మార్చిలో సూసైడ్ చేసుకున్న రైతు
- ఓ ఆఫీసర్‌ను గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
బచ్చన్నపేట, వెలుగు : ఓ రైతు ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ ఆఫీసర్‌ను జనగామ జిల్లా బచ్చన్నపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం... బచ్చన్నపేట రెవెన్యూ ఆఫీస్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి రూ. 6 లక్షలు ఇస్తే రికార్డుల్లో లేని 1.20 ఎకరాలను తన పేరు మీద రాయిస్తామని పడమటి కేశ్వాపూర్ గ్రామానికి చెందిన రైతు కొమ్మాటి రఘుపతిని నమ్మించారు.
దీంతో రైతు సదరు ఆఫీసర్లకు రూ. 4.50 లక్షలు ఇచ్చాడు. ఏడాది గడిచినా తన పేరున భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రైతు ఇద్దరిని నిలదీశాడు. దీంతో ‘మాకు డబ్బులే ఇవ్వలేదు పో’ అని ఆఫీసర్లు చెప్పడంతో రైతు రఘుపతి మార్చి 22న సూసైడ్ చేసుకున్నాడు. రైతు కుటుంబ సభ్యులు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగడంతో ఇద్దరు ఆఫీసర్లు పరార్ అయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నెల రోజుల కింద సర్వేయర్ రవీందర్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్‌ను ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద రూ. 60 వేలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.