రెవెన్యూ శాఖను బద్నాం చేయొద్దు.. అవినీతి ఏ శాఖలో లేదు: ఉద్యోగులు

రెవెన్యూ శాఖను బద్నాం చేయొద్దు.. అవినీతి ఏ శాఖలో లేదు: ఉద్యోగులు

మూసారాంబాగ్ : రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు సంఘాల వారీగా హైదరాబాద్ లోని మూసారాంబాగ్ లో సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలంగాణను అవినీతి లేని రాష్ట్రంగా మార్చాలంటే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా అని రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి ప్రశ్నించారు.

“నాలుగు రోజుల క్రితం కేసీఆర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బలమైన రెవెన్యూ చట్టం తీసుకురావాలని కోరాం. రాష్ట్రంలో భూ సమగ్ర సర్వే చేయాలి. భూమి ఒకరిది, రికార్డులో మరొకరిది ఉన్న కేసులు చాలా ఉన్నాయి. దీనిని సరిచేసేందుకు నిపుణుల కమిటీ వేస్తే… వారి సూచనల మేరకు మేము నడుచుకుంటాం” అన్నారు.

తెలంగాణను అవినీతి రహితంగా మార్చాలంటే రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా? ఏ శాఖలో అవినీతి లేదు? అన్ని శాఖల్లో అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులు ఉన్నారు. ల్యాండ్ రికార్డుల విషయంలో రాత్రి, పగలు కష్టపడి పనిచేశామని కేసీఆర్ మమ్మల్ని ఇటీవలే పొగిడారు. కేసీఆర్ మమ్మల్ని పొగిడి మాకు నెల జీతం బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడం భావ్యమా? 94 శాతం ల్యాండ్ ప్రక్షాళన చేశాం. ఎక్కడ నుంచి ఏ రైతు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. మా రెవెన్యూ ఉద్యోగులను లంచం గొండులు అనడం సరి కాదు” అన్నారు.

ఎంతో కష్టపడి తాము రెవెన్యూ శాఖలోకి వచ్చామని చెప్పారు వంగా రవీందర్ రెడ్డి. “టాస్ వల్ల చాలా మంది ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయి. టాస్ ను మేము వ్యతిరేకిస్తున్నాం. రెవెన్యూ శాఖ జవాబుదారీతనం ఉన్న శాఖ. దీనికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అది ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఎన్నో సేవలు చేస్తున్న మమ్మల్ని బద్నాం చేయవద్దు. జననం నుంచి మరణం వరకు రెవెన్యూ శాఖ చూసుకుంటుంది. ధరణి వెబ్ సైట్ ను తహసీల్దార్ ఫ్రెండ్లీగా మార్చాలి. బి కేటగిరీలుగా ఉన్న భూములను మార్చాలి. రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్ లకు ఎలాంటి ఇబ్బంది కలుగవద్దు. జిల్లాల నుంచి మాపై చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి. ఉద్యోగం అనేది ఉద్యోగులకు భద్రత కల్పిస్తుంది. అలాంటిది.. మా ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఆందోళనలో ఉన్నారు. రెవెన్యూ శాఖ పనులను ప్రైవేట్ కు ఇస్తే వ్యతిరేకిస్తాం. మంత్రులకు బాధ్యత ఇవ్వడం సీఎం ఇష్టం. కలెక్టర్ లకు ఇవ్వడం వల్ల అందరికి లాభం జరుగుతుంది.  మంత్రులకు ఇవ్వడం వల్ల కొంత మందికి మాత్రమే లాభం జరుగుతుంది” అన్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు.