
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేయాలని.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసమే భూ భారతిని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి చెప్పారు. కొత్తగా10,954 జీపీఓ పోస్టులు, కొత్త డివిజన్లు, మండలాలకు 361 పోస్టులు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం మంత్రి పొంగులేటిని రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నేతలు కలిశారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి సమక్షంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, పూర్వ వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నాయకులు పొంగులేటిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.