కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు..ఇక కోర్టు మెట్లెక్కే అవసరం ఉండదు

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు..ఇక కోర్టు మెట్లెక్కే అవసరం ఉండదు
  •     ఇది నాలుగ్గోడల మధ్య తయారు చేసింది కాదు.. ప్రజాభిప్రాయంతో రూపొందించింది
  •     దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతున్నది
  •     కొత్త ఆర్వోఆర్ చట్టం ముసాయిదాపై చర్చలో వక్తలు 
  •     సామాన్యులకూ అర్థమయ్యేలా ఉన్నది: లచ్చిరెడ్డి 
  •     18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం: భూమి సునీల్ 
  •     ఇది చరిత్రలో నిలిచిపోతది: ప్రొఫెసర్ జీబీ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మళ్లీ నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వక్తలు, రెవెన్యూ నిపుణులు అన్నారు. కొత్తగా తీసుకొస్తున్న ఆర్వోఆర్ చట్టం పేదలు, రైతులకు చుట్టంగా మారుతుందని చెప్పారు. ఇన్ని రోజులు ఏ సమస్య వచ్చినా కోర్టుకు పోవాల్సి వచ్చేదని, ఇకపై కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదని అన్నారు. తెలంగాణ భవిష్యత్​తరాలకు ఉపయోగపడేలా ఆర్వోఆర్​ చట్టం–2024 ముసాయిదా ఉందని ప్రశంసించారు. ‘‘ఇది ఒకరిద్దరి అవసరాల కోసం తయారు చేసిన చట్టం కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల అభిప్రాయం తీసుకుని చట్టాన్ని రూపొందించారు” అని వక్తలు అన్నారు.

‘‘ఇది నాలుగ్గోడల మధ్య.. ఇద్దరు వ్యక్తులతో తయారు చేయించిన చట్టం కాదు. నానాటికి పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త చట్టానికి ప్రభుత్వం రూపునిచ్చింది” అని వక్తలు కొనియాడారు. ఈ చట్టంతో రైతులు, పేదలకు రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందుతాయని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజాలో కొత్త ఆర్వోఆర్​చట్టం ముసాయిదాపై డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్​ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్స్​అసోసియేషన్​అధ్యక్షుడు లచ్చిరెడ్డి, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్​కుమార్, ఓయూ లా కాలేజీ ప్రొఫెసర్​జీబీ రెడ్డి, వివిధ జిల్లాల నుంచి ఎమ్మార్వోలు పాల్గొన్నారు. 

ధరణితో రైతులు నష్టపోయారు: లచ్చిరెడ్డి 

ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారని డిప్యూటీ కలెక్టర్స్​అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలతో రెవెన్యూ డిపార్ట్​మెంట్​పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ‘‘తనకున్న 20 ఏండ్ల అనుభవంతో భూమి సునీల్​ఈ చట్టాన్ని తయారు చేశారు. ప్రజల దగ్గరికి వెళ్లి, వారి నుంచి సలహాలు తీసుకుని చట్టాన్ని రూపొందించారు. ఇదేదో నాలుగ్గోడల మధ్య ఇద్దరు వ్యక్తులు కలిసి రూపొందించిన చట్టం కాదు. చట్టం రూపకల్పనలో భూమి సునీల్​కు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. 

సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చట్టాన్ని రూపొందించారు. సోషల్​మీడియాలో కొందరు వ్యక్తులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు” అని అన్నారు. ‘‘గతంలో రెవెన్యూ శాఖ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. రెవెన్యూ అధికారులు పనిచేసే అవకాశం లేకుండా చేశారు. ప్రతి చిన్న పని కోసం రైతులు సీసీఎల్ఏకు​వచ్చేలా చేశారు. దీంతో రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. కొత్త చట్టంతో రైతుల ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీనిపై రైతులు, ప్రజలకు వివరించాలి” అని సూచించారు. ‘‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తులో నిబంధనలు మార్చుకునేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు. సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు వీలు దొరుకుతుంది. సీసీఎల్ఏ దాకా రావాల్సిన అవసరం ఉండదు. గ్రామానికో రెవెన్యూ ఆఫీసర్​ కూడా అందుబాటులో ఉండి సేవలందించే రోజులు కూడా రాబోతున్నాయి. ప్రజలకు గ్రామ, మండల స్థాయిలోనే అన్ని సేవలు అందుతాయి” అని చెప్పారు. 

ఇక భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు: భూమి సునీల్ 

దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రూపొందించినట్టే.. రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేలా కొత్త ఆర్వోఆర్​చట్టం రూపొందించామని భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ కుమార్ చెప్పారు. మన రాజ్యాంగం రూపొందించిన టైమ్ లో విదేశాల్లోని మంచి నిబంధనలను పెట్టుకున్నట్టుగానే.. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న ఆర్వోఆర్​ చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, వాటిలోని అంశాలను కొత్త చట్టంలో చేర్చామని తెలిపారు. దీనికోసం రెండు నెలలు శ్రమించామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తమతో ఎన్నో గంటలు చర్చలు జరిపారని పేర్కొన్నారు. భూచట్టాల్లో మార్పులు తెచ్చి తీరాలని సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచే రేవంత్​ రెడ్డి పరితపించేవారని, అందులో భాగంగానే కొత్త చట్టాలు వచ్చాయన్నారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికే 1936, 1948, 1971, 2020లో మొత్తం నాలుగుసార్లు ఆర్వోఆర్​చట్టాలు వచ్చాయి. 

ఇప్పుడు తీసుకొస్తున్న ఐదో ఆర్వోఆర్ చ‌‌‌‌ట్టానికో ప్రత్యేకత ఉంది. వచ్చే పది ఇరవై ఏండ్లను దృష్టిలో పెట్టుకుని చట్టానికి రూపకల్పన చేశాం. స్వాధీనంలో భూమి, చేతిలో ప‌‌‌‌ట్టా, రికార్డులో పేరు ఈ మూడు ఉన్నప్పుడే ఏ రైతుకైనా భూమిపై సంపూర్ణ హ‌‌‌‌క్కులు ద‌‌‌‌క్కుతాయి. వీటి కేంద్రంగానే కొత్త చ‌‌‌‌ట్టం ఉండ‌‌‌‌బోతున్నది. వ్యవసాయ భూముల‌‌‌‌కు ఏ విధంగానైతే భూమి హ‌‌‌‌క్కుల రికార్డు ఉంటుందో.. కొత్త చ‌‌‌‌ట్టంలో వ్యవసాయేత‌‌‌‌ర భూముల‌‌‌‌కు కూడా భూమి రికార్డు రాబోతున్నది. దేశంలో వ‌‌‌‌స్తున్న మార్పులు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న భూ విధానాల‌‌‌‌కు అనుగుణంగా కొత్త చ‌‌‌‌ట్టం ఉంటుంది. రైతులకు పాస్​బుక్కులతో పాటు భూమి తమదని చెప్పుకునేలా భూధార్​కార్డులు ఈ చట్టం ద్వారా వస్తాయి. గతంలో రికార్డుల్లో లేని భూములనూ చట్టంతో రికార్డుల్లోకి ఎక్కించవచ్చు. వ్యవసాయ భూములకే కాకుండా ఆబాదీ భూములూ రికార్డుల్లోకి ఎక్కించుకోవడానికి వీలవుతుంది. గత చట్టంలో రికార్డుల్లో సవరణ చేయాలన్నా కోర్టుకు పోవాల్సిన అవసరం ఉండేది. ఇకపై ఆ అవసరం ఉండదు’’ అని వెల్లడించారు.

రైతుల కష్టాలు తీరుతయ్: ప్రొఫెసర్​ జీబీ రెడ్డి 

గతంలో చిన్న సమస్య వచ్చినా కోర్టులకు పోవాల్సి వచ్చేదని, దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారని ప్రొఫెసర్​జీబీ రెడ్డి అన్నారు. 2020 ఆర్వోఆర్ చ‌‌‌‌ట్టంలో అప్పీల్, రివిజ‌‌‌‌న్​చేసే మెకానిజం లేద‌‌‌‌న్నారు. ‘‘ప్రజ‌‌‌‌లు, రైతుల‌‌‌‌కు రెవెన్యూ సేవ‌‌‌‌లు అందుబాటులో ఉండేలా కొత్త చ‌‌‌‌ట్టం ముసాయిదా ఉన్నది. ఇందులో చిన్న చిన్న మార్పులు చేసి, చ‌‌‌‌ట్టంగా అందుబాటులోకి తెస్తే రైతుల క‌‌‌‌ష్టాలు తీరుతాయి. ఇక కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఉండదు. ఇది అత్యున్నతమైన చట్టంగా చరిత్రలో నిలిచిపోతుంది. రెవెన్యూ అధికారులు, ప్రజలు, రైతుల‌‌‌‌కు మేలు చేసే చ‌‌‌‌ట్టంగా ఉంటుంది. భూమి సునీల్​భూయజ్ఞం చేసి ఈ చట్టాన్ని తయారు చేశారు. దీన్ని వెంట‌‌‌‌నే అమ‌‌‌‌ల్లోకి తేవాలి” అని కోరారు.