- జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 49,692 అప్లికేషన్లు
- 25,025 అప్లికేషన్లకు అప్రూవల్
- 12,242 అప్లికేషన్లు రిజెక్ట్.. పెండింగ్ లో మరో 12,445 అప్లికేషన్లు
కరీంనగర్, వెలుగు: వివిధ భూసమస్యలపై రైతులు ధరణి పోర్టల్ ద్వారా పెట్టుకున్న అప్లికేషన్ల పరిష్కారంపై కలెక్టర్ సహా రెవెన్యూ ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరిష్కరిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా ధరణి అప్లికేషన్లన్నీ పెండింగ్ లో ఉండడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతుల సమస్యలపై ఫోకస్ చేసిన ప్రభుత్వం 10 రోజుల్లో పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కూడా ధరణి అప్లికేషన్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
సగానికిపైగా దరఖాస్తులు క్లియర్
వివిధ భూసమస్యలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 49,692 అప్లికేషన్లు రాగా ఇందులో 25,025 అప్లికేషన్లను కలెక్టర్ అప్రూవ్ చేశారు. 12,242 అప్లికేషన్లను రిజెక్ట్ చేయగా.. మరో 12,445 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పెండింగ్ మ్యుటేషన్, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్, నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్, పాస్ బుక్ డేటా కరెక్షన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, కోర్టు కేసులు, ఆధార్ సీడింగ్, సర్వే నంబర్ మిస్సింగ్, ఎక్స్ టెన్షన్ కరెక్షన్ తదితర అనేక అప్లికేషన్లు ఉన్నాయి. అప్రూవ్ చేసిన 25 వేల అప్లికేషన్లకు సంబంధించిన రిపోర్టులను కలెక్టర్ తెప్పించుకుంటున్నారు.
తహసీల్దార్లకు వారం క్రితమే లాగిన్ రావడంతో వారు ఎప్పటికప్పుడు రిపోర్టులు స్కాన్ చేసి అప్ లోడ్ చేస్తున్నారు. ఆర్డీవోలు వెరిఫై చేసి అడిషనల్ కలెక్టర్ కు పంపితే అక్కడి నుంచి కలెక్టర్ లాగిన్ లోకి వెళ్తున్నాయి. తహసీల్దార్లు పంపే నివేదికల ఆధారంగా శాశ్వత పరిష్కారం చూపనున్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తిగా ధరణి అప్లికేషన్లపైనే కసరత్తు చేస్తూ ఒక్కో తహసీల్ ఆఫీసులో రోజుకు 20 వరకు రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 12,445 అప్లికేషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
సరైన కారణాలు లేకుండానే రిజెక్ట్.. ?
వివిధ భూసమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో 12,242 అప్లికేషన్లు రిజెక్ట్ కావడం అనుమానాలకు తావిస్తోంది. అప్లికేషన్లు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ దరఖాస్తుదారుకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది. అయితే డ్యాష్ బోర్డుపై పెండింగ్ అప్లికేషన్ల నంబర్ ను తగ్గించుకునేందుకు కూడా రెవెన్యూ ఆఫీసర్లు కొన్నింటిని పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తహసీల్దార్లకు టార్గెట్స్ పెట్టాం..
లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిశాక ధరణి అప్లికేషన్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టాం. ఒక్కో తహసీల్దార్ రోజూ కనీసం 20 దరఖాస్తులకు సంబంధించిన రిపోర్టులు పంపేలా, 20 భూసమస్యలు పరిష్కరించేలా టార్గెట్స్ పెట్టాం. దీంతో తహసీల్దార్లు కూడా భూసమస్యలపైనే పనిచేస్తున్నారు. తహసీల్దార్లకు, నాకు లాగిన్ వచ్చాక ప్రాసెస్ స్పీడయింది. నా స్థాయిలో సమస్యలను పరిష్కరించడంతోపాటు మరికొన్నింటిని కలెక్టర్ లాగిన్ కు పంపుతున్నా.
మహేశ్వర్, ఆర్డీవో, కరీంనగర్