
మందు.. లిక్కర్.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంగా మారింది. జనం కూడా వేల కోట్లు దగలేస్తున్నారు మందుకు.. మంచినీళ్లు తాగినంత ఈజీగా.. మందు కొడుతున్నారు అనటానికి ఇదే సాక్ష్యం.. నిదర్శనం. తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది.. అంటే 2024 మార్చి నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు.. లిక్కర్.. మందు అమ్మకాల ద్వారా సంపాదించిన డబ్బు ఎంతో తెలుసా.. అక్షరాల 48 వేల 344 కోట్ల రూపాయలు. ఇది ఆల్ టైం రికార్డ్.. 50 వేల కోట్లకు అతి దగ్గరగా ఉండటం విశేషం.
తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ అమ్మకాలు చేస్తుంది. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్. హోల్ సేల్, రిటైల్ ద్వారా అమ్మకాలు సాగిస్తుంది టాస్మాక్ కార్పొరేషన్. 2024.. 25 ఆర్థిక సంవత్సరంలో.. 365 రోజుల్లో.. ఏకంగా 48 వేల 344 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది తమిళనాడు సర్కార్. ఇందులో 37 వేల 324 కోట్ల రూపాయల అమ్మకం పన్ను ద్వారా రాబట్టుకుంటే.. ఎక్సైజ్ ద్వారా 11 వేల 20 కోట్లను సంపాదించింది ప్రభుత్వం.
ప్రతి ఏటా తమిళనాడు లిక్కర్ ఆదాయం భారీగా పెరుగుతుండటం చూస్తుంటే.. తాగుబోతులు ఏ రేంజ్ లో పెరుగుతున్నారో అర్థం అవుతుంది. 2021 = 2022 ఆర్థిక సంవత్సరంలో 36 వేల 51 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 = 2023 ఏడాదికి 44 వేల 121 కోట్ల రూపాయలను ఆర్జించింది ప్రభుత్వం. మూడేళ్లలోనే ఒక్క మద్యం ద్వారానే 12 వేల కోట్ల రూపాయల ఆదాయం పెరగటం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే 5.4 శాతం అదనంగా ఆదాయం వచ్చినట్లు తమిళనాడు ప్రభుత్వ ఎక్సైజ్ మంత్రి సెంథిల్ బాలాజీ అసెంబ్లీలో ప్రకటించారు.
టాస్మాక్ కు 38 జిల్లా ఆఫీసులు, 43 ఇండియన్ మేడ్ ఫారిన్ స్పిరిట్ డిపోలు, 4 వేల 787 రిటైల్ షాపులు, 2 వేల 362 బార్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేస్తుంది తమిళనాడు సర్కార్. లోకల్ బ్రాండ్లు, ఇతర రాష్ట్రాల బ్రాండ్లు, ఫారిన్ బ్రాండ్లకు సంబంధించి 228 రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచింది తమిళనాడు సర్కార్. అదే విధంగా 551 రకాల ఫారిన్ బ్రాండ్లు సైతం మద్యం ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
ఇదే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం మరో విధానాన్ని కూడా అమలు చేస్తోంది. ఖాళీ మద్యం సీసాలకు బై బ్యాక్ పథకాన్ని అమలు చేస్తోంది. మీరు బీరు లేక ఇతర ఫుల్ బాటిల్ మద్యం కొనుగోలు చేసే సమయంలో MRP ధర కంటే అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తారు. మీరు మళ్లీ ఖాళీ బాటిల్ ను మద్యం షాపులో ఇచ్చినట్లయితే 10 రూపాయలు తిరిగి ఇస్తారు లేదా కొత్తగా కొనుగోలు చేసే మద్యం సీసాపై 10 రూపాయలు మినహాయిస్తారు అన్నమాట. దీని వల్ల ఖాళీ మద్యం సీసాలు తిరిగి షాపులకు చేరతాయని.. దీని వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు అధికారులు.
తమిళనాడు ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో.. 48 వేల కోట్ల రూపాయలు సంపాదించటం సంచలనంగా మారింది.