రూ.50 వేల లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్​ఐ

గజ్వేల్​, వెలుగు: భూమి ఫౌతీ(అనువంశిక పట్టామార్పిడి) కోసం రిపోర్టు ఇవ్వడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ కథనం ప్రకారం..ములుగు మండలం బండనర్సంపల్లి గ్రామానికి చెందిన అవుసుల ఆంజనేయులు చనిపోయిన తర్వాత అతడి పేరిట ఉన్న 1.14  ఎకరాల భూమిని తన పేరిట మార్చాలని ఆయన బిడ్డ గిరిజారాణి సిద్దిపేట జిల్లా ములుగు తహసీల్దార్​ప్రవీణ్​కు దరఖాస్తు పెట్టుకుంది.

అయితే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్​పెక్టర్​(ఆర్​ఐ) మహ్మద్​ జావేద్​పాషాను తహసీల్దార్ ​ఆదేశించారు. ఈ మేరకు రిపోర్టు ఇవ్వడానికి రూ.లక్ష లంచం ఇవ్వాలని  జావేద్​పాషా డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు గిరిజారాణి ఏసీబీని ఆశ్రయించింది.

వారి సూచనల మేరకు గురువారం గౌరారం సమీపంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్​లో ఆర్ఐకి రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ ఆధ్వర్యంలో రైడ్​చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తర్వాత తహసీల్దార్​ ఆఫీసులో విచారణ జరిపి కేసు నమోదు చేశారు. లంచం తీసుకుంటూ దొరికిన ఆర్​ఐని రిమాండ్​కు తరలించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సీఐ రమేశ్, ఎస్సై వెంకట్ రాజు గౌడ్ పాల్గొన్నారు.