యాదగిరిగుట్టపై లింక్‌‌ బ్రిడ్జి మూడు నెలల్లో పూర్తి కావాలి :మంత్రి కొండా సురేఖ

యాదగిరిగుట్టపై లింక్‌‌ బ్రిడ్జి మూడు నెలల్లో పూర్తి కావాలి :మంత్రి కొండా సురేఖ
  • అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి దేవస్థానానికి వెళ్లే భక్తుల రాకపోకల కోసం గుట్టపై నిర్మాణంలో ఉన్న లింక్‌‌ బ్రిడ్జిని మూడు నెలల్లో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రంలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రగతి, యాదాద్రి పురోగతి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాలపై బుధవారం సెక్రటేరియెట్‌‌లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ, దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ తదితర శాఖల సమన్వయంతో ఆలయాల ప్రగతి పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ నివేదిక సమర్పించాక యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం స్వర్ణతాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రాయగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్ల వ్యయంతో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు రామప్ప స్ఫూర్తితో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నాట్య మండపం, పరిసరాలను తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే, భద్రాచల ఆలయానికి గోదావరి నది వల్ల వరద ముంపు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మూడు సర్క్యూట్‌‌లలో వీఐపీ దర్శన సదుపాయంపై సీఎంతో చర్చించి మార్గదర్శకాలు ఖరాలు చేస్తామని చెప్పారు.