- యాదగిరిగుట్టలో చేపట్టిన పనులపై వైటీడీఏకు మంత్రి సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో చేపట్టిన అభివృద్ధి పనులు, అందుకు చేసిన ఖర్చుల వివరాలన్నీ అందజేయాలని యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ (వైటీడీఏ)ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వైటీడీఏ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో చేపట్టిన అభివృద్ధి పనులపై బుధవారం సెక్రటేరియెట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైటీడీఏ ఏర్పాటు, దాని ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భూసేకరణ, గత బీఆర్ఎస్ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు, అందుకు గల కారణాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును మంత్రి సురేఖ అడిగి తెలుసుకున్నారు.
ఆయన అసమగ్ర సమాచారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, డీపీఆర్ ల సమర్పణ, బిల్లుల చెల్లింపు, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం గురువారంలోగా అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హంగుఆర్భాటాలకు పోయిందే తప్ప, భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.
భక్తుల బాధలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ అభివృద్ధి పనులు చేస్తూనే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కాగా, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆలయ ఈవో భాస్కర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.