- శాసన సభలో భూ భారతి బిల్లు
- ధరణిలోని మంచి అంశాలు కొనసాగిస్తం
- మేం భేషజాలకు వెళ్లడం లేదు
- 22, 23 సార్లు డ్రాఫ్టులు మార్చి మెరుగైన బిల్లు తెచ్చాం
- 33 జిల్లాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నం
- ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణలు చేస్తున్నం
- గ్రామ కంఠాల్లోని భూముల సమస్యలు పరిష్కరిస్తం
- భూభారతి చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చాం
- ప్రతి రైతుకూ భూధార్ కోడ్ ఇవ్వనున్నాం
- ఇక నుంచి ప్రతి ఏటా జమా బందీ నిర్వహిస్తం
- సాదా బైనామా కింద 9.24లక్షల దరఖాస్తులొచ్చాయి
- వాటి పరిష్కారానికి మార్గాలను చూపుతున్నాం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ భద్రత కల్పించడమే లక్ష్యంగా భూభారతి బిల్లును ప్రవేశపెడుతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన ధరణి పోర్టల్‌లో లక్షల సమస్యలు వచ్చాయని అన్నారు. ధరణి పోర్టల్ తో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని, గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాల దాకా వెళ్లిందని అన్నారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైందని అన్నారు. గత పాలకులు తెచ్చిన ఈ లోప భూఇష్ట చట్టం వల్ల భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటి కాళ్ల కింద నేల కదిలిపోయిందని విమర్శించారు.
బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నా.. పరిష్కారం చేసే మార్గం లేకుండా పోయిందని చెప్పారు. లోపభూయిష్టమైన ఆర్‌వోఆర్ చట్టం-2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. లోపాల కారణంగా నాలుగు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అన్నారు.
18 లక్షల 26వేల ఎకరాలు పార్ట్-బీలో ఉందని, ఏ కారణం చేత ఈ భూమిని పార్ట్-బీలో పెట్టారనేది తెలియడం లేదన్నారు. పాసు బుక్కుల్లో ఉన్న భూములకు, పొజిషన్‌లో ఉన్న భూములకు తేడా కనుక్కోవడానికి చట్టంలో నిబంధనలు రూపొందించామని చెప్పారు. ఈ దేశంలో భూ సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటేనే ఒక బాధ్యత అని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారమే ధరణిని సాగనంపామని, ఆ స్థానంలో భూభారతి తీసుకొస్తున్నామని అన్నారు. గ్రామం కంఠాలు, ఆబాదీ భూములకు భూభారతి చట్టం పరిష్కారమార్గం చూపుతుందని అన్నారు. సభ్యులు సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటామని పొంగులేటి చెప్పారు.
సాదా బైనామాల కింద 9.24లక్షల దరఖాస్తులొచ్చాయని, వాటికింద అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుకునే అవకాశం చట్టంలో కల్పించామని వివరించారు. ప్రతి ఏడాదీ జమా బందీ కార్యక్రమం నిర్వహించేలా చట్టంలో పొందుపరిచామని వివరించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేలా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు.
మంచిని స్వీకరిస్తం
ధరణి పోర్టల్ లోని మంచిని స్వీకరిస్తామని, ఎలాంటి భేషజాలకు వెళ్లబోమని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇప్పటి వరకు 22,23 సార్లు డ్రాఫ్టులు మార్చి బిల్లును ప్రవేశపెడుతున్నామని వివరించారు. ప్రత్యేక కమిటీ 33 జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు.
ప్రతి రైతుకూ భూధార్
భూభారతి చట్టం ప్రకారం.. ప్రతి రైతుకూ భూధార్ కార్డులను అందించనున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఒక కోడ్ కేటాయిస్తామని చెప్పారు. దానిని స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భూభారతి చట్టంలో భూధార్ అంశాన్నీ చేర్చామని వివరించారు.
ప్రతి ఏటా జమాబందీ
గతంలో భూములకు సంబంధించి జమాబందీ నిర్వహించే వారని, ఇకపై ప్రతి ఏటా జమాబందీ నిర్వహించడం వల్ల రైతులకు తమ భూమి తమ స్వాధీనంలో ఉందనే నమ్మకం ఏర్పడుతుందని ఈవిషయాన్ని కూడా భూభారతి చట్టంలో చేర్చినట్టు మంత్రి పొంగులేటి చెప్పారు.