- బ్యాంకులో రూ. 12,300 కోట్లు
- రైతులూ ఆఫీసర్లను కలువండి
- 26 రోజుల్లో 22 లక్షల మంది ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు వేశాం
- త్వరలో రేషన్, హెల్త్ కార్డులు
- మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
హైదరాబాద్: అర్హులైన రైతులందరికీ రుణమాపీ వర్తింపజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రూ. 7 లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాన్ని తమకు అప్పగించిందని అన్నారు. అయినా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కేవలం 26 రోజుల్లో రూ.18 వేల కోట్లతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా రూ. 12 వేల 300 ల కోట్లు రుణమాఫీ కింద ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు.
ఆ మొత్తం బ్యాంకుల్లో ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాత్రం లక్ష రూపాయల రుణమాఫీని 4 విడతలుగా రైతులకు వారి ఖాతాలో వేసిందని గుర్తు చేశారు. రూ. 2 లక్షలకు పైబడి రుణం ఉన్న వారికి ప్రభుత్వం రూ. 2 లక్షలు చెల్లిస్తుందని, మిగతా మొత్తం రైతులు చెల్లించుకోవాలని అన్నారు. దీనిని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. రూ. రెండు లక్షల పైన ఉండే అమౌంట్ పెద్ద మొత్తంలో ఉంటే దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెడుతామని తెలిపారు. రూ.2 లక్షల పైన ఉండే అమౌంట్ చిన్నది అయితే రైతులు ఇప్పటికిప్పుడు కట్టగలుగుతారని అన్నారు.
ఆ అమౌంట్ లక్షల్లో ఉంటే రైతులు ఇప్పటికిప్పుడు కట్టలేరని, అందుకే కొంత సమయం ఇచ్చేలా కట్ ఆఫ్ డేట్ పెడతామని పొంగులేటి వివరించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లలో సమావేశాలు పెట్టి కొత్త రెవెన్యూ చట్టంపై సలహాలు తీసుకుంటామని అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రేషన్ కార్డులను రెండు సెక్టార్ లుగా విభజిస్తామని అన్నారు. ఒకటి రేషన్ కార్డు..రెండోది హెల్త్ కార్డు అని, ఇవి కూడా త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెప్పారు.