
గద్వాల, వెలుగు : గద్వాల జిల్లాకు శనివారం మొదటిసారి వచ్చిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ దగ్గర ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత పుష్పగుచ్ఛాలు అందించారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చిన మంత్రి గోన్పాడు దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు.
ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత
గద్వాల కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో రెవెన్యూ మంత్రి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి మీటింగ్ లో జడ్పీ మాజీ చైర్పర్సన్, ఎమ్మెల్యే వర్గీయులు విజిల్స్ వేస్తూ పోటాపోటీ
నినాదాలు చేశారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ను స్టేజీ పైకి పిలవకపోవడంతో అలిగి వెళ్లిపోయారు. ఎంపీ మల్లు రవి నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేసినా వినకుండా సభలో గందరగోళం సృష్టించారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ప్రసంగం ముగిసిన తర్వాత సరిత దంపతులు మంత్రితో కొద్దిసేపు ముచ్చటించారు.