ఎకో పార్క్​లను డెవలప్ ​చేస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఎకో పార్క్​లను డెవలప్ ​చేస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : రాష్ట్రంలో ఎకో పార్కులను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి అన్నారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం, పాల్వంచ పట్టణాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన శుక్రవారం పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు భారీ మోటార్​ సైకిల్​ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటారు.

లక్ష్మీదేవిపల్లి, పాల్వంచలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎకో పార్కుల ఏర్పాటుకు చాలా అవకాశాలున్నాయన్నారు. పులి వస్తే ప్రమాదం అనే భ్రమ నుంచి ప్రజలు బయటకు రావాలన్నారు. వాటికి అభద్రత కలిగినప్పుడే దాడులు చేస్తాయని చెప్పారు.

జిల్లాలో పులుల అవాసానికి అవసరమైన ఫారెస్ట్​ను ఆఫీసర్లు డెవలప్​ చేస్తున్నారని తెలిపారు. పలు రకాల జంతువులకు జిల్లాలోని ఫారెస్ట్​ నెలవు కావాలన్నారు. కొత్తగా పోడు ఎవరూ కొట్టడం లేదన్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు సమన్వయంతో అడవిని కాపాడుకోవాలని సూచించారు. రేగళ్ల ప్రాంతంలోని భూ సమస్యను ఫారెస్ట్​, రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే చేసి ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఫారెస్ట్​ అధికారులతో పాటు కలెక్టర్​ ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందిస్తుండటం అభినందనీయమన్నారు.

పోడు భూముల్లో ఐటీసీ సహకారంతో యూకలిప్టస్​ మొక్కలను పెంచేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ కుటుంబానికి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 500గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని మోసం చేసిందని, తమ ప్రభుత్వం త్వరలో వారికి ఇంటి స్థలం పట్టాను అందజేయనుందని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్​లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఖనిజాలు, అనేక సహజ వనరులున్నా ఈ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్​ ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

పొల్యూషన్​ను అధికంగా ఉన్న ఈ జిల్లాలో గ్రీనరీతోనే పొల్యూషన్​కు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. జిల్లా ప్రెస్​ క్లబ్​ కోసం అవసరమైన ల్యాండ్​ను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు సూచించారు. పాల్వంచలో దాదాపు రూ. 50లక్షలతో నిర్మించిన సింథటిక్​ కోర్టును ప్రారంభించిన ఆయన క్రీడాకారులతో కలిసి టెన్నీస్​ ఆడారు. అర్చరీ క్రీడాకారులతో మాట్లాడారు. క్రీడాకారులను ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..

ఈ ప్రోగ్రాంలో సీసీఎఫ్​ భీమా నాయక్, కలెక్టర్​జితేశ్​వి పాటిల్, ఎస్పీ బి. రోహిత్​ రాజు, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ కృష్ణాగౌడ్​, డీఆర్​డీవో విద్యాచందన, జిల్లా క్రీడల, యువజన శాఖాధికారి పరంధామయ్య, మార్క్​ ఫెడ్​ డైరెక్టర్​ కొత్వాల శ్రీనివాస్​, పలు శాఖల అధికారులు వెంకటేశ్వరరావు, శేషాంజన్​ స్వామి, రాజేశ్​పాల్గొన్నారు.