బంజారాలతో కాంగ్రెస్​ది ఫెవికాల్​ బంధం : పొంగులేటి

  • సంత్​ సేవాలాల్​ జయంతి వేడుకల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి 

కూసుమంచి,వెలుగు:   బంజారాలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఫెవికాల్​ బంధమని , దాన్ని ఎవరూ విడదీయలేరని  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.    ఖమ్మం జిల్లా  కూసుమంచిలో సంత్ సేవాలాల్ మహరాజ్  జయంతి ఉత్సవాల్లో  పాల్గొన్న మంత్రి  మాట్లాడుతూ,  బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.  హింస, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని  సేవాలాల్ బోధించారని గుర్తు చేశారు.  

మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని  బంజారాలంతా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని, ఇందిరమ్మ రాజ్యం మీద బంజారాలకు నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల్లో   కొన్ని ఇప్పటికే అమలు చేశామని,   మిగిలిన వాటిని  వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, ఎంపీపీ మంగీలాల్, బజ్జురి వెంకటరెడ్డి, తహశీల్దార్ సురేశ్​ ,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, గిరిజన నాయకులు  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్గొన్నారు.