ఊరికో రెవెన్యూ ఆఫీసర్.. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ

ఊరికో రెవెన్యూ ఆఫీసర్.. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ
  • ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి చాన్స్
  • పాత వీఆర్వోలకు కొత్త జాబ్ చార్ట్.. 18 రకాలకుపైగా డ్యూటీలు
  • 12 వేలకుపైగా రెవెన్యూ అధికారుల నియమాకానికి కసరత్తు
  • సగం మంది పాత వీఆర్వోలకే చాన్స్.. మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్   
  • గెట్టు పంచాయితీలకు చెక్​ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం
  • పాత వీఆర్వోల నుంచే వెయ్యి మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం
  • ఇకపై ఆన్​లైన్​తో పాటు మాన్యువల్​గానూ రికార్డుల నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: క్షేత్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత సర్కారు రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికీ ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతానికి వీఆర్వోలుగా పరిగణిస్తున్న వీరికి కొత్త జాబ్ చార్ట్​ను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో 18 రకాలకుపైగా డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు.ఈ రెవెన్యూ అధికారులకు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయితీలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో వీఆర్వోలుగా పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన పాత వీఆర్వోల్లో అనుభవం ఉన్నవారిని సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా12 వేలకు పైగా గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా12 వేల రెవెన్యూ ఆఫీసర్లను నియమించనున్నారు. అందులో సగం అంటే దాదాపు 6 వేల మంది ఇప్పటికే వీఆర్వోలుగా పని చేస్తున్నవారిని తీసుకోనుండగా, మిగిలిన 6 వేల మందిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్​ద్వారా నియమించనున్నారు.

కొత్తగా వెయ్యి మంది సర్వేయర్లను కూడా తీసుకునే అవకాశముంది. అవకాశమున్న చోట వీఆర్వోలనే సర్వేయర్లుగా తీసుకుని ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.గతంలో వీఆర్వోలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సర్కారు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. తిరిగి వారినే నియమిస్తే.. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే గ్రామాల్లో పని చేయనున్న విలేజ్ ఆఫీసర్లు, సర్వేయర్లకు జవాబుదారీతనం పెంచేలా అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024లో కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి చట్టంగా తీసుకువస్తే ఇకపై గ్రామానికో రెవెన్యూ అధికారి, మండలానికి కనీసం ఇద్దరు చొప్పున సర్వేయర్లు అందుబాటులోకి రానున్నారు. 

విలేజ్ ఆఫీసర్లతోనే ఫీల్డ్ ఎంక్వైరీ 

అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని ఈ అధికారులతోనే చేయించేలా జాబ్ చార్ట్ ను ప్రభుత్వం తయారు చేస్తోంది. రెవెన్యూ రికార్డులను మాన్యువల్​గా వీరితోనే నిర్వహించనుంది. కొత్తగా 12 కాలమ్ ల నుంచి14 కాలమ్​లు మాన్యువల్ రికార్డ్స్​లలో పెట్టనున్నట్లు తెలిసింది. దీంతో పాటు గ్రామానికొక అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్​కం వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు (మ్యానువల్ పహాణీలు), ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ కొత్తగా నియమించనున్న అధికారులకు అప్పగించనుంది.

ల్యాండ్ సర్వే సంబంధిత పనులలో సహాయం ​ చేయడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండడం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు వంటి బాధ్యతలతో పాటు సాధారణ పరిపాలన శాఖకూ సహాయం చేసేలా డ్యూటీ చార్ట్ రూపొందిస్తున్నారు. వాస్తవానికి 2020 అక్టోబరుకు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి.

రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. వీరు గతంలో క్యాస్ట్, ఇన్​కం, పంచనామాతో పాటు భూములకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టులు ఇచ్చేవారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్‌‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.     

సర్వేయర్ల కొరత అధిగమించేలా.. 

ధరణిలో ఒక భూమిని అమ్మాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ఆయా భూములకు సంబంధించి సరిహద్దులతో కూడిన సర్వే మ్యాప్​లు పెట్టాలనే నిబంధనను ప్రభుత్వం కొత్త చట్టంలో తీసుకొస్తున్నది. ఆర్ఓఆర్–2024 చట్టానికి రూపం వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో.. కొంత టైం తీసుకోనుంది. అయితే, రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రతి మండలంలో భూముల సర్వే కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్‌‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 232 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు.

ప్రతి మండలంలో ఇద్దరు సర్వేయర్లు ఉండేలా కొత్తగా వెయ్యి మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం పాత వీఆర్వోలకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నది. అర్హత ఉన్న వెయ్యి మంది వీఆర్వోలకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి సర్వేయర్లుగా తీసుకోనుంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగినా సర్వేయర్ల శాంక్షన్డ్ పోస్టులు పెరగలేదు. దీంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అధ్యయనం చేసి పాత వీఆర్వోలనే సర్వేయర్లుగా తీసుకోనున్నది. 

గ్రౌండ్​లెవల్​లోనే పరిష్కరించేలా..

కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించిన సమస్యలను గ్రౌండ్ లెవెల్​లోనే పరిష్కరించేలా సులభతరం చేస్తున్నది. ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపించనున్నారు. భూబదలాయింపు సందర్భంగా ఏదైనా కంప్లైట్ వస్తే ఇప్పుడున్న దాని ప్రకారం ఆపడానికి లేదు. అయితే ఇప్పుడు తీసుకువచ్చే చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ లో మ్యుటేషన్‌‌ చేసే సమయంలో విచారణ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ విచారణలో తప్పు జరిగిందని తేలితే మ్యుటేషన్‌‌ నిలుపుదల చేసేలా నిబంధన పెట్టారు.

ఇది ప్రస్తుతం ఉన్న చట్టంలో లేదు. ఒకవేళ తప్పు జరిగినట్టు నిర్ధారణ జరిగితే కారణాలు వివరిస్తూ మ్యుటేషన్‌‌ను ఆపేయవచ్చని పేర్కొన్నారు. రిజిస్టర్డ్‌‌ దస్తావేజులు, భాగం పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌‌ను విచారించే అధికారం తహశీల్దార్లకు, మిగిలిన సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌‌ చేయాల్సి వచ్చినప్పుడు మ్యుటేషన్‌‌ చేసే అధికారం కొత్త డ్రాఫ్ట్​లో ఆర్డీవోకు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టంలో భూ సమస్యలకు సంబంధించిన అప్పీళ్లకు అవకాశం లేదు. దీంతో కలెక్టర్, సీసీఎల్ఏకు రెండు స్థాయిల్లో అప్పీళ్లకు అవకాశం కల్పించారు.