కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. కల్లూరు ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్ పెక్టర్) వెంకటేశ్వర్లు, వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) మద్దిలేటి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
నంద్యాల చెక్ పోస్టు సమీపంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమణారెడ్డి తన వద్ద ఉన్న రివాల్వార్ లైసన్స్ రెన్యువల్ కోసం జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించి సిఫారసు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ అతని దరఖాస్తును కలెక్టర్ ద్వారా కల్లూరు తాహశీల్దార్ కు పంపారు. కల్లూరు మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కొన్ని రోజులపాటు దరఖాస్తును పెండింగ్ లో పెట్టాడు. దీంతో నేరుగా ఆర్ఏను నిలదీయగా.. కనీసం 10 వేలయినా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఇచ్చుకోలేక రూ.7 వేలకు బేరం కుదుర్చుకున్న రమణారెడ్డి ఆ మొత్తం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 7 వేలు లంచాన్ని తన అసిస్టెంట్ ద్వారా ఆర్ ఐకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆర్ ఐ ఆ లంచాన్ని నేరుగా తీసుకోకుండా తన అసిస్టెంట్ వీఆర్ఏ మద్దిలేటి ద్వారా తీసుకున్నారు. అపుడు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం మద్దిలేటిని, ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఐ,వీఆర్ఏలను కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.