మల్లారెడ్డి కబ్జా చేశారో.. లేదో.. తేల్చండి.. మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ సర్వే

మల్లారెడ్డి కబ్జా చేశారో.. లేదో.. తేల్చండి.. మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ సర్వే

కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641,642,643,644,641/AAలో మొత్తంగా 7 ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించాడని బహదూర్ పల్లి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్తెమ్మ కోర్టుకు వెళ్ళారు. తమకు వంశ పారంపర్యంగా వస్తున్న భూమిని చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేశాడని, తమకు న్యాయం కావాలని 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు తెలిపారు.

భూమిని సర్వే చేయాలని, మల్లారెడ్డి యూనివర్శిటీలోని భూమి కబ్జా చేసిందో.. లేదో.. సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఫిబ్రవరి 2వ తేదీన కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీకి చేరుకున్న మేడ్చల్ మండల రెవెన్యూ సిబ్బంది, సర్వే పూర్తి చేసి రిపోర్టును అడ్వకేట్ కమిషనర్కు అందజేస్తామని తెలిపారు. అయితే సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మొదట కళాశాలలోనికి అనుమతించకుండా సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్ళి సర్వేకి సహకరించడంతో రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేశారు.