![మల్లారెడ్డి వర్సిటీలో రెవెన్యూ అధికారుల సర్వే](https://static.v6velugu.com/uploads/2025/02/revenue-officials-conducted-a-survey-at-mysammaguda-mallareddy-university_R7S9zvoT2m.jpg)
మేడ్చల్, వెలుగు: మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641, 642, 643, 644, 641/AA లో 7 ఎకరాల భూమిని కబ్జా చేసి యూనివర్సిటీ నిర్మించారని గతంలో బహదూర్ పల్లికి చెందిన పిట్ల యాదగిరి, సత్తెమ్మ కోర్టుకు వెళ్లారు. తమకు వంశ పారపర్యంగా వస్తున్న భూమిని ఎమ్మెల్యే మల్లారెడ్డి కబ్జా చేశారని, తమకు న్యాయం కావాలని 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఫిబ్రవరి 2న కోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా సోమవారం కాలేజీకి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని యాజమాన్యం మొదట అనుమతించలేదు. ఆ తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ రెడ్డితో వెళ్లి అధికారులు సర్వే పూర్తి చేశారు. సర్వే రిపోర్ట్‌ను కమిషనర్ కు అందజేస్తామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు.