- ఫస్ట్‌ఫేజ్‌లో 14.8 కిలోమీటర్ల పరిధిలో తొలగింపు
- నిర్మాణాలపై చర్యలకు రెవెన్యూ అధికారులు రెడీ
- ఇప్పటికే బఫర్ జోన్ లో 9 వేల కట్టడాల గుర్తింపు
- అభ్యంతరాలకు తొమ్మిది రోజులే మిగిలిన గడువు
- అర్హులకు డబుల్ఇండ్లు ఇస్తమంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: మూసీ నది వెంట అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు రెవెన్యూ శాఖ రెడీ అయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల పరిధిలో 44 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తోంది. ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల వెంట సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు మొత్తం 9 వేల అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్‌లోని నిర్మాణాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలని గత నెల 27 నుంచి ఈ నెల 9 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటికే ఐదురోజులు పూర్తవగా నాలుగురైదుగురు నుంచి మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఇందులోనూ ఇల్లు పోతే తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు. ఇంకా చాలామంది నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.
ముందుగా నిర్మాణాలను తొలగిస్తేనే..
లంగర్ హౌస్‌లోని టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు ఫస్ట్‌ఫేజ్‌లో భాగంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.545 కోట్లకు పాలనాపరమైన అనుమతులను కూడా జారీ చేసింది. ఇక పనులు మొదలుపెట్టడడమే మిగిలింది. ముందుగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తేనే పనులు చేపట్టే అవకాశం ఉండగా రెవెన్యూ అధికారులు స్పీడ్ పెంచారు. అభ్యంతరాలకు గడువు ముగియగానే ఓ వైపు నోటీసులు జారీ చేస్తూనే మరోవైపు కూల్చివేతలకు ప్లాన్చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో పనులను లంగర్‌హౌజ్ నుంచి నాగోల్వరకు 14.8 కిలో మీటర్ల మేర ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలపై ముందుగా చర్యలు తీసుకుంటారు. బఫర్ జోన్ పేరుతో తమను ఖాళీ చేయిస్తే ఊరుకోమని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా ఉంటున్న తమను ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
అర్హులకు ‘డబుల్’ ఇండ్లు
మూసీ వెంట ఎప్పటి నుంచో ఉంటున్న వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించి ఖాళీ చేయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని ముసారంబాగ్, లంగర్ హౌస్, నాంపల్లి, అంబర్ పేట్, చాదర్ఘాట్తదితర ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చి ఖాళీ చేయించనున్నారు. మిగతా వారికి నోటీసులు జారీ చేసిన తర్వాత ఇండ్ల ఖాళీకి చర్యలు తీసుకోనున్నారు. అప్పటికి వినకపోతే కూల్చివేయనున్నారు. మొత్తానికి ఈసారి మాత్రం మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు పూర్తిగా తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
లైట్ తీసుకుంటుండగా..
ఇప్పటికే చాలాసార్లు మూసీ నది వెంట ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. కొన్నిచోట్ల కూల్చివేతలకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా హడావిడి చేసి వదిలేస్తారని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారు లైట్తీసుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేని ఆక్రమణలకు సంబంధించిన సర్వే నంబర్లను కూడా తహసీల్దార్ఆఫీసులు, ఆర్డీవో ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచినా ఎవరూ పట్టించుకోవడంలేదు. కూల్చివేతలపై రెవెన్యూ అధికారులు సీరియస్ గానే ఉన్నారు. మూసీపై వంతెనలు నిర్మాణాలకు ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ప్రెజర్ ఉండగా ఈసారి తప్పనిసరిగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
బఫర్ జోన్ పేరుతో ఖాళీ చేయించొద్దు
బఫర్ జోన్ పేరుతో మూసీ నది ఇరువైపులా 50 మీటర్ల మేర ఉన్న నిర్మాణాలను తొగిస్తామనే దానిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలె. నదిలో ఇండ్లు ఉండి ఇబ్బందిగా ఉండే వాటినే తొలగించాలి. ముందుగా వారికి ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయించాలి. బఫర్ జోన్ పేరుతో తరలిస్తామంటే ఊరుకోం. ఎక్కడ లేని విధంగా ఇక్కడే బఫర్ జోన్ ఎందుకు.? 9 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఏ లెక్కన గుర్తించారు. ఇలాగైతే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఒకవేళ మెట్రో పిల్లర్లను కూడా తొలగిస్తారా.? కూల్చివేతలపై తగ్గకుంటే పోరాటం తప్పదు.
– ఎం. శ్రీనివాస్, సీపీఎం సిటీ సెక్రటరీ
50 మీటర్ల మేర తొలగింపు దారుణం
ఇన్నాళ్లు లేని బఫర్ జోన్ ఇప్పుడు గుర్తొచ్చిందా.? మూసీకి ఇరువైపులా 50 మీటర్ల మేర ఉన్న నిర్మాణాలు తొలగిస్తామనడం దారుణం. నదిలోపల ఉన్న వాటిని తొలగించాల్సి వస్తే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. లేకపోతే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. కాంగ్రెస్ హయాంలో పేదలను ఆదుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. -కె. చంటిబాబు, కార్వాన్ సెగ్మెంట్ కాంగ్రెస్ బి బ్లాక్ ప్రెసిడెంట్