
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తున్నారు రెవెన్యూ అధికారులు. పర్మిషనల్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఆరంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఏప్రిల్ 25న కూల్చివేసిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పోలీసుల బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకొని కొంతమంది రియల్టర్లు,వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కబ్జాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఉండవని, అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే కూల్చివేతలు చేపడుతామని హెచ్చరించారు అధికారులు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో నిబంధనలకు విరుద్ధంగా జీ ప్లస్ 2 కి పర్మిషన్ తీసుకుని జీ ప్లస్ 6 బిల్డింగ్ ను నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు ఏప్రిల్ 25న ఉదయం ఆరంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు.