- రెవెన్యూ తప్పిదాలతో 30 ఎకరాలపై వివాదం
- ఎటూ తేల్చని ఆఫీసర్లు
- నాలుగైదేండ్ల కింద గుడిసెలు వేసుకున్న కుటుంబాలు
- భూదాన్ పట్టాలున్నాయంటున్న గుడిసె వాసులు
- తమ పట్టాభూములంటున్న ప్రైవేట్ వ్యక్తులు
- హద్దులు తేల్చని రెవెన్యూ అధికారులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో రెవెన్యూ అధికారుల తప్పులతో తిప్పలు తప్పడం లేదు. రూ.100 కోట్ల విలువైన 30 ఎకరాల భూములపై వివాదం నెలకొంది. నాలుగైదేండ్లుగా దాదాపు 8 ఎకరాల్లో వందల మంది గుడిసెలు వేసుకోవడంతో తరచుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ ప్రైవేట్ పట్టా భూమిలో గుడిసెలు వేసుకున్నారంటూ కొందరు చెబుతుండగా, భూదాన్ భూముల్లో తమకు కేటాయించిన పట్టాల ప్రకారమే గుడిసెలు వేసుకున్నామని నివాసం ఉంటున్నవారు చెబుతున్నారు.
పోలీసులను, జేసీబీలు, డోజర్లను వెంటబెట్టుకొని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్కడి గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండడంతో స్థానికులు తిరగబడుతున్నారు. ఈ సమయంలో రెండు వర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకోవడంతో తలలు పగిలి గాయాలవుతున్నాయి. ఇప్పటికే మూడ్నాలుగు సార్లు ఇదే పరిస్థితి రిపీట్ అయింది. రెండు వర్గాలూ కోర్టులను ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఇష్యూ తీర్పు వరకు రాకపోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది.
రూ. కోట్ల విలువైన భూమి..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం, అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ వెంచర్లు, విల్లాలు ఉండడంతో ఈ భూములకు రూ.కోట్లలో ధర పలుకుతోంది. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147, 148, 149 సర్వే నంబర్లలో కలిపి 60 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 31.04 ఎకరాల భూమి భూదాన్ ట్రస్ట్ బోర్డుకు చెందినదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అదే సర్వే నంబర్లలో మిగిలిన భూమికి గాను ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలుండగా, వాటిలో కొందరు వెంచర్లు కూడా వేశారు.
వివాదం ఇలా..
2019లో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అక్కడికి వచ్చి భూదాన్ బోర్డుకు చెందిన భూముల్లో గుడిసెలు వేసుకోవడం మొదలుపెట్టారు. ముందు 50 రేకుల ఇండ్లతో మొదలుకాగా, ఐదేండ్లలో కొన్ని వందల ఇండ్లు ఏర్పడ్డాయి. క్రమంగా భూదాన్ భూములను ఆనుకొని ఉన్న ప్రైవేట్ భూముల్లోనూ ఇండ్లు కట్టుకున్నారు. దీంతో పట్టాదారులకు, ఇండ్లు కట్టుకున్న వారికి మధ్య వివాదం మొదలైంది. తమ భూముల్లోంచి ఇండ్లను తొలగించాలంటూ పట్టాదారులు పోలీసులను ఆశ్రయించడం, కోర్టులకు వెళ్లగా
వారిని ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నాలతో వివాదం తీవ్రమైంది. తమకు భూదాన్ పట్టాలున్నాయని స్థానికులు చెబుతుండగా, ఎప్పుడో రద్దయిన భూదాన్ ట్రస్టు బోర్డు పేరుతో ఫోర్జరీ పట్టాలు సృష్టించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. అయితే పట్టాలు నిజమైనవేనా? భూదాన్ భూముల హద్దులెక్కడ?అని నిర్థారించాల్సిన రెవెన్యూ అధికారులు లైట్ తీసుకోకపోవడంతో ఈ వివాదానికి ముగింపు పడడం లేదు.
మా పట్టా భూమిలో గుడిసెలు వేసుకున్రు..
పోతుల వెంకటేశ్వర్లు, సీతయ్య అనే వ్యక్తుల నుంచి సర్వే నబంర్148లో మూడెకరాల ఎనిమిది కుంటలు, సర్వే నంబర్149లో ఐదు ఎకరాలను కొనుగోలు చేశాను. రూ.30లక్షలు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించి, చట్టబద్ధంగా లే అవుట్ వేశాను. కొందరు మా పట్టా భూమిలో గుడిసెలు వేసి, తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నా వాహనాన్ని ధ్వంసం చేశారు. భూమిపై అన్ని హక్కులు నాకే ఉన్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులపై ఉంది.
- వేజళ్ల సురేశ్‌కుమార్, ఖమ్మం
భూదాన్ భూముల్లోనే గుడిసెలు వేశాం..
మాకు భూదాన్ ట్రస్ట్ బోర్డు ఇచ్చిన పట్టాలున్నాయి. భూదాన్భూముల్లోనే ఇండ్లు కట్టుకున్నాం. కొందరు మా మీద కావాలనే కుట్రలు చేసి ఖాళీ చేయించాలని చూస్తున్నారు. నీళ్లు, కరెంటు లేకున్నా, ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించకున్నా చీకట్లో బతుకుతున్నాం. పోలీసులు కూడా డబ్బున్న వారికే సహకరిస్తున్నారు.
- నాగమణి, స్థానికురాలు